Hyderabad: హైదరాబాద్‌లో అదృశ్యం అయ్యి..విజయవాడలో ప్రత్యక్షమైన బీజేపీ నేత
మొదట మిస్సింగ్ అన్నారు. తర్వాత కిడ్నాప్ అన్నారు. ఎమ్యెల్యేనే కిడ్నాప్ చేయించాడంటూ ఆరోపించారు. సీన్ కట్ చేస్తే మిస్సయిన తిరుపతిరెడ్డి పోలీసుల ముందు ప్రత్యక్షం అయ్యారు. తిరుపతి ప్రొడక్షన్స్ వారి కిడ్నాప్ డ్రామా అట్టర్‌ఫ్లాప్ అంటున్నారు ఆయన ప్రత్యర్థులు. రాజకీయం, రియల్ ఎస్టేట్ కలిపి చేసే తిరుపతిరెడ్డి...ఇన్ని రోజులు ఏమయ్యారు? ఎక్కడికెళ్లారు?
రోజుల తరబడి నడిచిన కిడ్నాప్ కహానీకి ఎట్టకేలకు తెర పడింది. రియల్టర్ కమ్ బీజేపీ పొలిటీషియన్ కిడ్నాప్ కహానీకి పోలీసులు ఫుల్‌స్టాప్ పెట్టారు. రియల్టర్ తిరుపతి రెడ్డి మిస్సింగ్… ఎన్నో మలుపులు తిరిగి ముగిసింది. అతడు మిస్ అయ్యాడా…? కిడ్నాప్ అయ్యాడా…? పారిపోయాడా..? కావాలనే అజ్ఞాతంలోకి వెళ్ళాడా…? ఇప్పటికీ తేలడం లేదు..! ప్రత్యక్షం అవడానికి ముందు ఈ కేసులో రియల్ ఎస్టేట్ మసాలా, పొలిటికల్ గరం మసాలా మిక్సింగ్ అయి నాటకాన్ని రంజుగా రక్తి కట్టించాయి. కొద్ది రోజుల క్రితం అల్వాల్‌లో బీజేపీ నేత తిరుపతి రెడ్డి మిస్సింగ్.. కలకలం రేపింది. జనగాంకి చెందిన బీజేపీ నేత తిరుపతి రెడ్డికి.. అల్వాల్ హిల్స్‌లో మూడు ఎకరాల స్థలం ఉంది. రాజకీయాలతో పాటు రియల్టర్‌గా కూడా ఉన్నాడు తిరుపతి రెడ్డి. అల్వాల్ MRO ఆఫీస్ కి పనిమీద వెళ్లిన తిరుపతి రెడ్డి మిస్ అయ్యాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడం.. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉండటంతో.. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తిరుపతి రెడ్డి భార్య సుజాత. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ సేకరించారు. అల్వాల్ MRO ఆఫీస్ దగ్గర తిరుపతి రెడ్డి తానే స్వయంగా ఆటోలో ఎక్కిన ఫుటేజ్ లభించింది. ఘట్ కేసర్ వద్ద ఆటో దిగి.. మరో కార్ లో ఎక్కడాన్ని గుర్తించారు పోలీసులు. ఆ కారు నెంబర్ ఆధారంగా కారు ఓనర్‌ను గుర్తించి.. అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. తిరుపతి రెడ్డి తన ఫ్రెండ్ అని.. భువనగిరిలో దించమని చెప్తే.. తన కారులో అక్కడ దించినట్లు చెప్పాడు.
ఎంతకూ తిరుపతి రెడ్డి జాడ లేకపోవడంతో.. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎదుట తిరుపతి రెడ్డి భార్య, తమ్ముడు, బంధువులు, జనగాం బీజేపీ నేతలు ఆందోళన చేశారు. పోలీసులు సర్దిచెప్పి.. ఆందోళన విరమింప జేశారు. మిస్సింగ్ వెనక అల్వాల్ కి చెందిన రియల్టర్ మామిడి జనార్దన్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు తిరుపతి రెడ్డి బంధువులు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే కిడ్నాప్ చేసినట్టు ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే మైనంపల్లి ఘాటుగా స్పందించారు. అసలు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలియదు అని.. ఎప్పుడూ చూడలేదన్నారు ఆయన. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నట్టు తెలిపారు. చివరకు ఎమ్మెల్యే మాటలే నిజమయ్యాయి. ఆయనపై తిరుపతిరెడ్డి బంధువులు అసత్య ఆరోపణలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. లేటెస్టుగా ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. తిరుపతి రెడ్డి స్వయంగా అల్వాల్ సిఐ కి కాల్ చేసి … పోలీస్ స్టేషన్ కి వస్తున్నట్లు చెప్పారని సమాచారం. ఇదే విషయాన్ని తిరుపతి రెడ్డి బంధువులకు చెప్పడంతో.. వాళ్లు పీఎస్ ఎదుట ఎదురు చూశారు. సాయంత్రం దాటినా రాకపోవడంతో… తిరుపతి రెడ్డి బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది.
అయితే 5 రోజుల క్రితం అల్వాల్‌లో మాయమైన తిరుపతిరెడ్డి మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. బంధుమిత్ర సపరివార సమేతంగా ఆయన రావడం కలకలం రేపింది. ఇంతకీ అతగాడు కిడ్నాప్ అయ్యాడా…? తప్పిపోయాడా…? కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడా…? అనేది మిస్టరీ గా మారింది. మరోవైపు తిరుపతి రెడ్డి పై కూడా రియల్ తగాదాలు, బెదిరింపులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో పలు పోలీస్ స్టేషన్లలో 15 కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిరెడ్డి ఎందుకు ఇలా చేశాడు అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకవేళ తిరుపతి రెడ్డి కావాలనే అజ్ఞాతం లోకి వెళ్తే.. దీనిపై కూడా కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు చర్యలు తప్పవంటున్నారు వాళ్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి