Telangana: విచారణ – అలజడి… ఏది నిజం? ఏది ప్రచారం?
అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతోంది. విద్యుత్ ఒప్పందాల్లో కేసీఆర్‌కు నోటీసులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక గొర్రెల స్కామ్‌లో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. అటు ట్యాక్స్‌ల పేరుతో అధికారపార్టీ అవినీతి పరాకాష్టకు చేరిందంటూ విపక్షాలు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆర్ ట్యాక్స్… బీ ట్యాక్స్.. యూ ట్యాక్స్.. తెలంగాణలో నిత్యం వినిపిస్తున్న మాటలు స్కాములు, ట్యాక్స్‌లు. మూడు ప్రధానపార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఎజెన్సీలు, కమిషన్లు కూడా విచారణ పేరుతో రంగంలో దిగడంతో నేతల్లో అలజడి మొదలైంది. అటు విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణలో స్పీడు పెంచాయి కమిషన్లు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ త్వరలోనే నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అటు విద్యుత్ ఒప్పందాల విషయంలో విచారణలో వేగం పెంచిన ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ నుంచి వివరణ కోరుతూ నోటీసులు కూడా ఇచ్చింది. అటు గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేయగా.. తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రివెంక్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద FIR నమోదు చేసి పశుసంవర్ధకశాఖను వివరాలు కోరింది. బీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ల పండగ అంటూ బీజేపీ అంటోంది.
అటు కాంగ్రెస్ మంత్రులను టార్గెట్ చేశారు ప్రతిపక్షనేతలు. అధికారంలోకి వచ్చి రాగానే అవినీతికి తెరలేపారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రామగుండం NTPCలోని ఫ్లైయాష్ తరలింపులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఫ్లైయాష్ స్కామ్‌కు తెరలేపారన్నారు. ఇటు పత్తి విత్తనాల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి. తెలంగాణలో పత్తి విత్తనాల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే కారణమన్నారు. పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర ఉందని.. పేరు చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు జగదీష్‌రెడ్డి.ఆ మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై సెన్సెషనల్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని… మంత్రిగా ఉన్న ఉత్తమ్ వసూళ్లకు పాల్పడ్డారని ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆర్.ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.
మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు అవినీతి, ఆరోపణల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి ఇందులో నిజాలేంటి? రాజకీయ ఆరోపణలేంటి? తేల్సాల్సింది ఏజెన్సీలే, నిజాయితీ నిరూపించుకోవాల్సి నాయకులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..