Telangana Rains: ఆకాశానికి చిల్లు పడినట్లుగా వాన.. వాగులో కొట్టుకుపోయిన ఆటో.. షాకింగ్ విజువల్స్..
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్దికొండలో ఓ ఆటో వరదలో కొట్టుకుపోయింది. రాజులతాండ గ్రామానికి వెళ్లే వాగు పొంగిపొర్లడంతో...
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్దికొండలో ఓ ఆటో వరదలో కొట్టుకుపోయింది. రాజులతాండ గ్రామానికి వెళ్లే వాగు పొంగిపొర్లడంతో ఆటో ఆ ప్రవాహ ధాటికి వాగులో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ ఆటోలోని ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్ధాపూర్, సోఫీనగర్ కాలనీలను మంత్రి పరిశీలించారు. కాలనీవాసులతో పలు సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దంచికొడుతున్న వానలు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుండుగూడెం దగ్గర ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తమకు ఉండడానికి గూడు కూడా లేదని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్ ప్రాంతాల్లో వర్షం ముంచెత్తింది. కోహెడ మండలం బస్వాపూర్ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు వరి, మొక్కజొన్న పత్తి పంటలు వరదలో మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివతేజ అందిస్తారు.
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్ధిపేట- హన్మకొండ ప్రధాన రహదారిపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. అటు తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తలంకపల్లి దగ్గర వరద ఉధృతితో రైల్వే లైన్ కోసం జరుగుతున్న నిర్మాణ పనుల్లో రోడ్డు కోతకు గురైంది. దీంతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. వాహనాలను నత్తుపల్లి నుంచి వేంనూరు మండలం చౌదవారం మీదుగా మళ్లిస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో నాన్ స్టాప్ వాన.. నడుం లోతులో లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్‌కు ఆటంకం