ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. బుధవారం జరిగే.. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరవుదామా..? వద్దా అన్న చర్చలు చేసి.. ఒక క్లారిటీకి వచ్చారు. ఈ సమావేశాలకు హాజరవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రతిపక్షాలు చేసే ధర్నాలకు అంశాల వారీగా మద్ధతివ్వాలన్న ఆలోచన చేశారు. అంతే కాదు పరిస్థితులను బట్టీ ఎప్పటికప్పుడు వ్యూహరచనలు మార్చేలా ప్రణాళిక రచించారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే స్టేట్, సెంట్రల్ మధ్య.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు వర్సెస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నడుస్తోంది. దానికి తోడు టీఆర్ఎస్ మంత్రుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటినీ సీరియస్ గా తీస్కున్న టీఆర్ఎస్- పార్లమెంటు వేదికగా.. బీజేపీపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చూస్తోంది. వీలైనంతగా బీజేపీని ఇరుకున పెట్టే ఎత్తుగడ వేస్తోంది టీఆర్ఎస్.
ఇక ఏపీ నుంచి చూస్తే.. జీ 20 సమావేశాలకు ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రావడంతో.. ఢిల్లీ వేదికగా.. ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాణి వినిపించేలా పథక రచన చేస్తోంది ప్రతిపక్ష టీడీపీ. ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరుపుకున్న టీడీపీ.. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి.. అవినీతికి పాల్పడుతోందని.. ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకురావాలని చూస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకునేలా డిమాండ్ చేయాలని నిర్ణయించారు తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారనీ. పార్లమెంటు సాక్షిగా ఈ అంశాలను లేవనెత్తాలనుకుంటున్నామని చెబుతున్నారు టీడీపీ ఎంపీలు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటి రుణాలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారనీ. పార్లమెంటులో చర్చించడం మాత్రమే కాదు- వీటన్నిటిపై మా పోరాటం కొనసాగుతుందని అంటున్నారు టీడీపీ ఎంపీలు. రాష్ట్ర హోదా కోసం తాము రాజీనామాలు చేయడానికైనా సిద్ధమేననీ. రాష్ట్రాభివృద్ధి కోసం తామెలాంటి త్యాగాలు చేయడానికైనా ముందుకొస్తామనీ. రాజీనామా డిమాండ్ చేసిన జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా సభను సజావుగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఈసారి సభకు అంతరాయం కలిగించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఈ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించనుంది. భారత్-చైనా సరిహద్దు వివాదం, రాజ్యాంగ సంస్థలలో ప్రభుత్వ జోక్యంతో పాటు ఆర్థిక సమస్యల కింద ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జీఎస్‌టీ సమస్యలను కాంగ్రెస్ లేవనెత్తుతుంది.
ఇదిలావుంటే.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు పాత భవనంలో మాత్రమే సమావేశాలు జరగనున్నాయి. ఇది 17వ లోక్‌సభకు 10వ సెషన్ కాగా, ఎగువ సభ అంటే రాజ్యసభకు ఇది 258వ సెషన్. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభమవుతాయి. 2017, 2018లో డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం