Dasoju Sravan : ‘అది చాలా దుర్మార్గం..’ ఇచ్చిన హామీలపై ఇక న్యాయపరమైన పోరాటం : దాశోజు శ్రవణ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలను దాస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన దొంగ సంఖ్యను..
Telangana Corona Deaths – Dasoju Sravan : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలను దాస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన దొంగ సంఖ్యను కేంద్రం పార్లమెంట్‌లో తక్కువ చేసి చూపడం ఇంకా దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ డెత్ అడిట్ జరగాలన్న శ్రవణ్.. 2020 మార్చి నుండి చూస్తే.. వేవ్ వన్, వేవ్ టు లో పిట్టల్లా జనం చనిపోయారని ఆయన అన్నారు. కానీ.. తెలంగాణ సర్కార్ కేవలం 3,710 మంది మాత్రమే చనిపోయినట్లు చూపడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.
“మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్ ఘడ్, కేరళ, ఒరిస్సా, పంజాబ్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో చనిపోయారని అక్కడి ప్రభుత్వాలు లెక్కలు చూపాయి.. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా మరణాలు ఎక్కువగా వున్నాయ్.. కానీ ప్రభుత్వం తక్కువ చూపింది” అని శ్రవణ్ పేర్కొన్నారు.
కొవిడ్ మరణాలపై ఆధారాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రవణ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ తరపున ఈ చర్చకు ఎవరు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల తల్లిదండ్రులు చనిపోయి.. చాలామంది పిల్లలు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై న్యాయపరమైన పోరాటం చేస్తామని శ్రవణ్ చెప్పుకొచ్చారు.