Congress-CPI: సింగరేణి ఎన్నికల కేంద్రంగా రాజుకున్న రగడ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ కలిసి వచ్చేనా..?
సింగరేణి ఎన్నికల్లో AITUC విజయభేరి మోగించింది. హోరాహోరీగా సాగిన పోరులో స్పష్టమైన మెజారిటీతో ‘నక్షత్రం’ గుర్తు సత్తా చాటింది. సింగరేణిలో మరోసారి కార్మిక సంఘం గుర్తింపు యూనియన్‌గా AITUC ఆవిర్భావించింది. సింగరేణి ఎన్నికల్లో గెలుపు పొందడంతో AITUC నాయకులు సంబరాలు చేసుకున్నారు.

సింగరేణి ఎన్నికల్లో AITUC విజయభేరి మోగించింది. హోరాహోరీగా సాగిన పోరులో స్పష్టమైన మెజారిటీతో ‘నక్షత్రం’ గుర్తు సత్తా చాటింది. సింగరేణిలో మరోసారి కార్మిక సంఘం గుర్తింపు యూనియన్‌గా AITUC ఆవిర్భావించింది. సింగరేణి సంస్థ పై మరోమారు ఎర్రజెండా ఎగిరింది. డిసెంబర్ 27న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మెజారిటీ కార్మికులు AITUC కి జై కొట్టారు. INTUC పై 1,999 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించిన AITUC సింగరేణిలో నాలుగోవసారి గుర్తింపు సంఘంగా ఎన్నికయింది.
నల్ల బంగారు సిరుల మాగాణి.. సింగరేణి సంస్థలో ఏడవ దఫాగా డిసెంబర్ 27న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ప్రాంతంలో ఘోర పరాభవాన్ని చవిచూసిన BRS, ఈ ఎన్నికల్లో తమ అనుబంధ TBGKS యూనియన్ ను పోటీకి దూరంగా ఉంచింది. దీంతో, ఊహించినట్లుగానే సింగరేణి ఎన్నికల్లో CPI అనుబంధ AITUC – కాంగ్రెస్ అనుబంద INTUC మధ్యే ప్రధాన పోటీ కొనసాగింది. నువ్వా.. నేనా.. అనే రీతిలో కొనసాగిన ఈ పోటీలో సింగరేణి సంస్థ వ్యాప్తంగా గల 11 డివిజన్లకు గాను, 6 డివిజన్లలో INTUC విజయం సాధించగా, మిగిలిన 5 డివిజన్లను AITUC గెలుచుకుంది.
గెలుచుకున్న డివిజన్ల పరంగా ఆదిక్యాన్ని ప్రదర్శించిన INTUC, మొత్తంగా పోలైన ఓట్లలో రెండవ స్థానానికి పరిమితమై ప్రాతినిధ్య సంఘంగా నిలిచింది. INTUC కంటే ఒక డివిజన్ తక్కువ గెల్చుకున్నప్పటికీ, మొత్తం ఓట్ల పరంగా 1,999 ఓట్ల ఆధిక్యంతో AITUC గుర్తింపు హోదాను దక్కించుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ – CPI, సింగరేణి ఎన్నికల్లో అనివార్యంగా ప్రత్యర్థులుగా తలపడ్డాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల్లో లభించిన ఫలితాలను బట్టి CPI అనుబంధ AITUC అధికారపక్షంగా, కాంగ్రెస్ అనుబంధ INTUC ప్రతిపక్షంగా నిలిచాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసి సింగరేణి ఎన్నికల్లో కుస్తీపడ్డ, కాంగ్రెస్ – CPI పార్టీల మధ్య భవిష్యత్తులో ఎలాంటి బంధం కొనసాగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం. కోల్ బెల్ట్ వ్యాప్తంగా గల ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ల గెలుపు, ఓటమిలలో సింగరేణి కార్మికుల ప్రభావం కీలకంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోలేక, సింగరేణి ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన BRS అనుబంధ సంస్థ, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు సాధించుకోవడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ – CPI పార్టీల మధ్య మళ్లీ సఖ్యత కొనసాగుతుందా..? లేదంటే, సింగరేణి ఎన్నికలు కేంద్రంగా రాజుకున్న రగడతో ప్రత్యర్థులు గానే మిగిలిపోతాయా..? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




