AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన బంగార్రాజు..

సైబర్ నేరగాళ్ల కన్ను పడితే సామాన్యులైనా.. కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోలైనా ఒక్కటే.. కింగ్‌ నాగార్జున స్వయంగా సైబర్ వలలో చిక్కుకున్నారా? ఆయన కుటుంబాన్నే ఏకంగా 7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారా? సైబర్ క్రైమ్ సదస్సులో నాగార్జున స్వయంగా బయటపెట్టిన నిజాలు వింటే ఆశ్చర్యపోతారు.

కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన బంగార్రాజు..
Actor Nagarjuna Reveals Cyber Fraud Attempt
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 6:17 PM

Share

సైబర్ నేరాలు సామాన్యులను మాత్రమే కాదు.. సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తున్నాయని హీరో అక్కినేని నాగార్జున వెల్లడించారు. తాను కూడా సైబర్ మోసగాళ్ల బారినపడినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు నిర్వహించిన సురక్ష కా తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. అంతేకాదు తన కుటుంబంలోని కొందరిని మాయమాటలతో దాదాపు 6, 7 గంటలపాటు డిజిటల్ అరెస్ట్ చేసిన ఘటనను గుర్తుచేశారు. బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో తనను నమ్మించే ప్రయత్నం చేశాడని నాగార్జున తెలిపారు. అదే సమయంలో తమ కుటుంబ సభ్యులకు కూడా సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పారు. విదేశాలకు నార్కోటిక్ సబ్‌స్టాన్స్ ఉన్న పార్సిల్ పంపారంటూ బెదిరించి, వారిని గంటల తరబడి భయాందోళనలకు గురిచేశారని వివరించారు. సైబర్ నేరాల నుంచి రక్షించుకోవడానికి తాను వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని నాగార్జున చెప్పారు. మొబైల్ పాస్‌వర్డ్‌ను తరచూ మారుస్తానని, వైఫై పాస్‌వర్డ్‌ను కూడా క్రమం తప్పకుండా మార్చుకుంటానన్నారు. మొబైల్‌లో వ్యక్తిగత ఫొటోలను కూడా స్టోర్ చేయనని వెల్లడించారు.

1977లో తాను ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయని నాగార్జున గుర్తుచేశారు. అప్పట్లోనే మాల్‌వేర్, హ్యాకింగ్ వంటి అంశాలపై ప్రొఫెసర్లు హెచ్చరించేవారని చెప్పారు. అప్పటి నుంచి సైబర్ నేరాల సమస్య కొనసాగుతూనే ఉందన్నారు. సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని నాగార్జున ప్రశంసించారు. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని కొనియాడారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అదేవిధంగా సినీ పరిశ్రమను వేధిస్తున్న పైరసీని అరికట్టడంలోనూ తెలంగాణ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారి చర్యల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కాలానుగుణంగా నేరాల స్వరూపం మారుతుందన్నారు. గతంలో భౌతిక దోపిడీలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం సైబర్ నేరాలు, నార్కోటిక్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. అందుకే వారిని సురక్ష కా తిరంగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు 40 రకాల సైబర్ మోసాలను గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయని చెప్పారు. సులభంగా అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ప్రజల నుంచి భారీ మొత్తాలను కాజేస్తున్నారని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైనప్పటికీ చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం ఏమనుకుంటుందోననే భయంతో బాధితులు ఘటనలను బయటకు చెప్పుకోవడం లేదన్నారు. సైబర్ నేరాలకు గురైన వారు పరువు పోతుందనే భయంతో మౌనం వహించకూడదని పోలీసులు సూచిస్తున్నారు. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని నాగార్జున పిలుపునిచ్చారు.

Follow Us