Nizamabad Constable Murder Case: సర్.. ముఖం చూసి అమాయకుడనుకునేరు! ట్యాలెంట్ అంతకుమించి..
accused of Nizamabad Constable Murder case: శుక్రవారం రాత్రి జరిగిన కానిస్టేబుల్ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడిని షేక్ రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో వరుస వాహన, గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వస్తే..

నిజామాబాద్, అక్టోబర్: నిజామాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కానిస్టేబుల్ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడిని షేక్ రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో వరుస వాహన, గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వస్తే.. కత్తితో దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశాడు. పోలీస్ రికార్డుల్లో రియాజ్ నేర చరిత్ర పరిశీలించిన పోలీసులు దెబ్బకు నోరెళ్లబెట్టారు. మూడేళ్లలో ఏకంగా 40 కేసులు నమోదైనాయి. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్ యుక్త వయసు నుంచే నేరాల బాటపట్టినట్టు పోలీసులు గుర్తించారు.
ఖరీదైన బైకులు, బుల్లెట్ బైకులు ఎక్కడ కనిపించినా క్షణాల్లో మాయం చేయడం రియాజ్ ప్రత్యేకత. దొంగిలించడంలో ఆరి తేరిన రియాజ్ ఏకంగా 30 బుల్లెట్ బైక్‌లను అపహరించాడు. ఇందుకు సంబంధించి సంబంధించి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. వాహనాలు దొంగిలించిన తర్వాత వాటి ఛాసిస్, ఇంజిన్ నంబర్లు మార్చి పొరుగున ఉన్న మహారాష్ట్రలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. అంతేకాకుండా రియాజ్‌పై 8 గొలుసు దొంగతనాలు, మరో రెండు దాడి కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మూడు సార్లు జైలుకు కూడా వెళ్లాడు.
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య అనంతరం నిందితుని నేర చరిత్రపై డీజీపీ ఆదేశాలతో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం పోలీస్ బృందాలు రియాజ్ నేర చరిత్రపై ఆరా తీశాయి. ఎస్‌ఎఫ్‌ఎల్ (ఫోరెన్సిక్ రిపోర్టు) డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన ప్రమోద్ విధులు ముగించుకుని శుక్రవారం సాయంత్రమే నిజామాబాద్‌కు వచ్చి సీసీఎస్ ఠాణాలో రిపోర్టు చేశారు. అదే రోజు నేరస్థుడు రియాజ్‌ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్ వెళ్లగా.. హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్‌తోపాటు ఎస్సై విఠల్‌పై కూడా నిందితుడు కత్తితో దాడిచేశాడు. అనంతరం అతడి స్నేహితుడి బైక్‌పై పరారయ్యాడు. నిందితుడు మహారాష్ట్రలో ఉన్నట్లు సమాచారం అందడంతో అతడి కోసం 9 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రమోద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ముగ్గురు పిల్లల చదువుకు సాయం చేస్తామని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








