AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కౌలుభూమిపై కన్నేసి దారుణం.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!

ఓ రైతు కౌలుభూమిపై కన్నేసి దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకు కుట్ర పన్నిన రైతు పక్క పొలంలో పనుల్లో మునిగిపోయిన మరో రైతు తాగే నీళ్లల్లో అతడికి తెలియకుండా పురుగుల మందు కలిపాడు. ఆ నీళ్లను తాగిన పొరుగు రైతు తీవ్ర అస్వస్థతకు గురై నెలరోజులకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు మృత్యువాత పడ్డాడు..

Telangana: కౌలుభూమిపై కన్నేసి దారుణం.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
Pesticide In Drinking Water
Srilakshmi C
|

Updated on: Mar 17, 2025 | 9:42 AM

Share

తిరుమలాయపాలెం, మార్చి 17: ఓ రైతు అత్యాశ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కౌలుభూమిపై కన్నేసి దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకు కుట్ర పన్నిన రైతు తాగే నీళ్లల్లో పురుగుల మందు కలిపాడు. ఆ నీళ్లను తాగిన పొరుగు రైతు నెలరోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కూచిపూడి జగదీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

తిరుమలాయపాలెం మండలం సోలీపురం శివారు పీక్యాతండాకు చెందిన కౌలురైతు బానోతు రామోజీ (59) ఆరు ఎకరాలను ఓ భూస్వామి వద్ద రూ.75 వేలకు కౌలుకు తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువైన మరో కౌలురైతు బానోతు రవి కూడా ఆరు ఎకరాలను రూ.1.25 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. వీరిద్దరూ తాము కౌలుకు తీసుకున్న భూముల్లో సేద్యం చేయసాగారు. కొన్నేళ్లుగా మిరప, పత్తి పంటలు సాగుచేస్తున్నారు. అయితే తాను కౌలుకు తీసుకున్న చేనులో రాళ్లు ఉండటంతో పంట సరిగా పడటంలేదని రవి భావించాడు. పక్కనున్న రామోజీ చేలో పంట అధికంగా రావడం రవి సహించలేకపోయాడు. ఆ కౌలు భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో పలుమార్లు రామోజీపై కయ్యానికి కాలుదువ్వాడు. ఫిబ్రవరి 12న చేను వద్దకు వచ్చిన రామోజీ మంచి నీళ్ల డబ్బాను చెట్టు కిందపెట్టి చేలో పని చేసుకుంటున్నాడు. గమనించిన రవి వెంటనే నీళ్ల డబ్బాలో పురుగుమందు కలిపాడు. ఇది తెలియని రామోజీ పొలం పనులు చేశాఖ అలసి పోయి ఆ నీళ్లను తాగేశాడు. ఆ తర్వాత ఆ నీళ్లు పురుగు మందు వాసన రావటంతోపాటు అశ్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అతడ్ని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పట్నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామోజీ ఆరోగ్య విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. రామోజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రవిపై కేసు నమోదు చేశారు. నీళ్లల్లో అతడే పురుగు మందు కలిపినట్లు దర్యాప్తులో తేలడంతో అతడిని అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.