Telangana: ఈ బక్కయ్య చాలా డిఫరెంట్.. 50 ఏళ్లుగా చొక్కా వేయలేదు..
చొక్కా అంటే అతనికి మహా చెడ్దా చిరాకు. చొక్కా వేసుకుంటే అదేదో తేళ్లు, జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే నలుబై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు. వాన అయినా.. ఎండా అయినా అంతే. ఇంతకీ అతను ఎందుకు చొక్కా వేసుకోడు. అతని గురించి స్థానికులు ఏమంటున్నారు తెలుసుకుందాం పదండి...
పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ముక్కెర బక్కయ్య. ఇతనిది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామం. ఇతన్నీ గ్రామంలో అందరు గాంధీ అని పిలుస్తారు. అందుకు కారణం ఆయన చొక్కా వేసుకోకపోవడం. బక్కన్నకు చొక్కా వేసుకోవటం అంటే నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ల తల్లిదండ్రులు బక్కన్నకు చొక్కా వెయ్యలేదట. ఆర్థిక పరిస్థితులు కారణంగా చిన్నప్పుడు అతనికి చొక్కాలు వేయలేదు తల్లిదండ్రులు. అదే అతనికి అలవాటుగా మారింది. ఊహ తెలిసినప్పటి నుంచి బక్కన్న చొక్కా వేసుకోలేదు. ఆ తర్వాతి కాలంలో ఎన్నోసార్లు అతని అన్నా ప్రాదేయపడినా వినలేదు. యుక్త వయసు వచ్చాక బక్కన్నకు పెళ్లి కుదిరింది. పెళ్లి సమయంలో కూడా చొక్క వేసుకోలేదు. వచ్చిన భార్య ఎంతగానో బ్రతిమిలాడినా ఫలితం మాత్రం లేదు. తనకు చొక్కా అంటే ఇష్టం ఉండదని.. వేసుకుంటే సౌకర్యంగా ఉండలేనని చెప్పుకుంటూ వస్తున్నాడు. దీంతో విసిగి వేసారిపోయిన భార్య.. నేను నీతో ఉండాలంటే చొక్కా వేసుకోవాలి.. లేకపోతే వెళ్లిపోతానని హుకుం జారి చేసింది. నువ్వు వెళ్లిన పర్వాలేదు కానీ నేను మాత్రం చొక్క వేసుకోనని తేల్చి చెప్పాడు బక్కయ్య. దీంతో భార్య అతడ్ని వదిలి చాలా ఏళ్ల క్రితమే వెళ్లిపోయింది.చలికాలం వర్షకాలం, ఎండాకాలం, ఏ కాలమైనా అతను చొక్కా వేసుకోడు. చొక్కా లేకుండానే అన్ని ప్రాంతాలకు వెళ్తాడు. గతంలో వార్డు మెంబర్‌గా పని చేసిన బక్కయ్య మీటింగ్‌లకు, ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నా చొక్కా లేకుండానే వెళ్లేవాడు, చొక్కా శరీరంపై వేసుకుంటే తనకు చెమటలు వస్తాయని అందుకే 50 సంవత్సరాలుగా చొక్కా వేసుకోలేదని చెప్తున్నాడు.
బక్కయ్య గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇతర గ్రామస్తులు కూడా అతన్ని గాంధీ అని పిలుస్తుంటారు. భార్యాపిల్లలు ఎవరూ లేకపోవడంతో తన అన్న వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎముకలు కొరికే చలిలోనైనా, తోలు ఊడే ఎండలోనైనా, ఎడతెరపని వర్షంలోనైనా అతను చొక్కా లేకుండానే ఉంటాడు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండగా చలికి తట్టుకోలేక వెచ్చని దుంపట్లతో చలిని తప్పించుకుంటున్న ఈ సమయంలో కూడా బక్కయ్య ఒంటిపై ఏది కప్పుకోకుండానే పడుకుంటాడు. ఇంత చలిలోనూ చొక్కా వేసుకోని అతని తీరు నిజంగా విచిత్రమే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..