Telangana: నవ్వుతూ అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి.. కొద్దిసేపటికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే..?
నిన్నటివరకు నవ్వుతూ ఆడుకున్న ఆ చిన్నారి నవ్వులే చివరి జ్ఞాపకాలుగా మిగులుతాయని ఆ తల్లిదండ్రులు కలలో కూడా అనుకోలేదు. బిడ్డ ఆ ఫొటోలను చూసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. దసరా సెలవుల తర్వాత బుడిబుడి అడుగులతో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన ఐదేళ్ల చిన్నారి, విషపు పరుగు కుట్టడంతో ప్రాణాలు విడిచిన ఖమ్మం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ ఇంట్లో వినిపించిన చిన్నారి మువ్వల సవ్వడులు మూగబోయాయి. పక్కింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో రంగురంగుల బెలూన్లను చూసి మురిసిపోయిన ఆ పాపాయిని చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు, అదే బెలూన్ల నడుమ నిలబెట్టి ఫోటోలు తీసుకున్నారు. కానీ ఆ ఫోటోలే తమ బిడ్డకు చివరి జ్ఞాపకాలుగా మిగులుతాయని వారు కలలో కూడా ఊహించలేదు. బుడిబుడి అడుగులతో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విషపురుగు కాటుకు బలైన విషాద ఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని 7వ డివిజన్ టేకులపల్లి పరిధిలో నివాసముండే ధన్యశ్రీ (5) స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతుంది. అయితే అక్కడే చిన్నారిని ఏదో విషపురుగు కుట్టింది. కొద్దిసేపటికే చిన్నారి అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు కేంద్రానికి వెళ్లి చూసేసరికి చిన్నారి ముఖమంతా తీవ్రమైన దద్దుర్లు వచ్చి, ఒళ్లంతా వాచిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే భయపడిపోయిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరమంతా పాకడంతో వైద్యులు చికిత్స అందించేలోపే చిన్నారి ధన్యశ్రీ ప్రాణాలు విడిచింది.
అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?
విషపురుగు కుట్టిన వెంటనే కేంద్రం నిర్వాహకులు స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాప పరిస్థితి విషమిస్తున్నా సరైన సమయంలో పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆలస్యంగా సమాచారం ఇచ్చారని ఆరోపించారు. కేవలం అంగన్‌వాడీ టీచర్, సిబ్బంది అలసత్వం వల్లే తమకు కడుపుకోత మిగిలిందని వారు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
రోడ్డెక్కిన తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు
చిన్నారి మృతికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టేకులపల్లి ప్రధాన రహదారిపై తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు చిన్నారి మృతదేహంతో బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరికి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధిత కుటుంబానికి తగిన ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు నినదించారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
