AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గ్రామం కరువును జయించింది.. మత్తడి దూకుతున్న 2 చెరువులు.. తాగు, సాగు నీటికి డోకా లేదు..

కరువు ఛాయలు అలుముకున్నా.. నీటి సంరక్షణతో కరువును జయించింది కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల గ్రామం. వేసవిలోనే చెరువుల్లో పూడికతీత చేపట్టి, వరద కాలువ నీటిని సద్వినియోగం చేసుకోవడంతో రెండు చెరువులు నిండుకుండల్లా మారాయి. భూగర్భ జలాలు పెరిగి పంటలకు నీరందుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

ఈ గ్రామం కరువును జయించింది.. మత్తడి దూకుతున్న 2 చెరువులు.. తాగు, సాగు నీటికి డోకా లేదు..
Water Conservation
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 28, 2026 | 12:32 PM

Share

ఎల్ నినో ప్రభావంతో ఓవైపు వర్షాభావం.. మరోవైపు ఎండిపోతున్న పంటలు.. పంట చేతికొచ్చే సమయంలో నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తూ.. ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామం మాత్రం కరువును జయించింది. వృథాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. చెరువులను నింపుకుంది. వేసవిలోనే చెరువుల్లో పూడికతీత చేపట్టి.. నీటి వనరులను సంరక్షించుకుంది. ఫలితంగా.. ఇప్పుడు రెండు చెరువులు మత్తడి దూకుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి.. పంటలకు పుష్కలంగా నీరందుతోంది. కరువును జయించిన ఆ గ్రామమే.. రామడుగు మండలంలోని వెలిచాల. నీటి సంరక్షణతో సిరులు పండిస్తున్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.

కరువు ఛాయలు కమ్ముకున్నా.. సాగునీటి కోసం ఇబ్బందులు ఎదురైనా.. వెలిచాల రైతులు మాత్రం వెనకడుగు వేయలేదు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఈ గ్రామంలో సుమారు ఏడు వేల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉంది. గతంలో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్న ఈ గ్రామానికి.. వరద కాలువ అందుబాటులోకి రావడంతో నీటి వనరులపై ఆశలు చిగురించాయి. వర్షపు నీటితో పాటు.. వరద కాలువ ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుంటే కరువు సమస్యను అధిగమించవచ్చని రైతులు భావించారు.

అనుకున్నదే తడవుగా.. గ్రామ సర్పంచ్ నర్సింగరావు చొరవతో నీటి సంరక్షణకు శ్రీకారం చుట్టారు. వేసవిలోనే గ్రామంలోని పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో పూర్తిస్థాయిలో పూడికతీత చేపట్టారు. చెరువుల్లో పెరిగిన చెట్లను తొలగించడంతో పాటు.. నీరు చేరే కాలువలను శుభ్రం చేశారు. వర్షపు ప్రతి నీటి బొట్టు చెరువులకు చేరేలా చర్యలు తీసుకున్నారు. వరద కాలువ నుంచి వచ్చిన నీటిని కూడా వృథా కాకుండా చెరువుల్లోకి మళ్లించారు.

రైతుల కష్టం ఇప్పుడు ఫలించింది. పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో.. రెండు చెరువులూ నీటితో కళకళలాడుతున్నాయి. నిండుకుండల్లా మారిన చెరువులు మత్తడి దూకుతూ.. దిగువ ప్రాంతాలకు నీటిని అందిస్తున్నాయి. చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో భూగర్భ జలాలు కూడా మెరుగుపడ్డాయి. బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో తాగునీటి సమస్య కూడా లేకుండా పోయింది.

నీరు పుష్కలంగా ఉండటంతో.. వెలిచాలలో సాగు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వరితో పాటు పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు కూడా ఏపుగా పెరిగి రైతులకు ఆశాజనకమైన దిగుబడులను అందిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో పంటలు చేతికందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌లోనూ సాగునీటి ఇబ్బందులు ఉండవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండటంతో.. గ్రామ పరిసరాల్లో చల్లదనం పెరగడమే కాకుండా పక్షులు, ఇతర జీవులకు కూడా ఆవాసం లభిస్తోంది. చేపల లభ్యత పెరగడంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.

వెలిచాల గ్రామంలో మరో ఆరు కుంటలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిండుగా ఉన్న రెండు చెరువుల నుంచి ఈ కుంటల్లోకి నీటిని మళ్లించే ప్రణాళికను రూపొందిస్తున్నారు. వేసవి వరకు నీటిని నిల్వ ఉంచి.. అవసరమైన సమయంలో కుంటలను నింపేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. మరింత విస్తీర్ణంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు.. సాగు, తాగునీటి అవసరాలకు భరోసా లభించనుంది.

నీటి సంరక్షణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు వృథాగా పోతూనే ఉంది. కానీ వెలిచాల రైతులు మాత్రం తమకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. వేసవిలోనే చెరువుల్లో పూడికతీత చేపట్టడం.. నీరు వచ్చే మార్గాలను శుభ్రం చేయడం.. వరద కాలువ నీటిని ఒడిసిపట్టడం వంటి చర్యలతో అద్భుతమైన ఫలితాలను సాధించారు.

చుక్క చుక్కను ఒడిసిపడితే.. కరువును సైతం జయించవచ్చని వెలిచాల గ్రామం నిరూపిస్తోంది. నీటి వనరులను కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు నీటి భద్రత ఉంటుందనే సందేశాన్ని అందిస్తోంది. గ్రామస్థుల సమష్టి కృషి.. రైతుల ముందుచూపు.. నీటి సంరక్షణపై ఉన్న చిత్తశుద్ధి.. వెలిచాలను కరువు నుంచి గట్టెక్కించడమే కాకుండా.. వ్యవసాయానికి కొత్త ఆశలు చిగురింపజేశాయి. ప్రతి గ్రామం ఇలాంటి బాటలో నడిస్తే.. కరువు కష్టాలను అధిగమించడం అసాధ్యమేమీ కాదు.

Drought Management

Follow Us