AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తున్న మాయదారి ‘క్యూనెట్’.. తాజాగా సోదాల్లో వెలుగులోకి సంచలనాలు!

''ఎన్నిసార్లు చంపినా చావని పాము రా నువ్వు.." అనే డైలాగ్‌ ఆ మధ్య సోషల్‌ మీడియాలో పాపులర్ అయింది. సేమ్ టు సేమ్‌ అలాంటి పాములాంటిదే 'క్యూనెట్‌' స్కీమ్. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి వేలాదిమంది బాధితులను నిండా ముంచేసింది ఈ ఫ్రాండ్ కంపెనీ. లేటెస్ట్‌గా ఈ కంపెనీపై మరోసారి యాక్షన్ స్టార్ట్ చేశారు హైదరాబాద్ మహానగర పోలీసులు.

చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తున్న మాయదారి ‘క్యూనెట్’.. తాజాగా సోదాల్లో వెలుగులోకి సంచలనాలు!
Hyderabad City Police Commissioner V.c. Sajjanar
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 8:36 AM

Share

నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్‌పై మరోసారి పంజా విసిరారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు జరిపిన పోలీసులు..32 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. క్యూనెట్ మోసాలపై వందల కేసులు నమోదయ్యాయని, దాంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ పేరు చెప్పకుండా మంచి వ్యాపార అవకాశం అంటూ యువతను, ఐటీ ఎంప్లాయిస్‌ను ఈ ఊబిలోకి దించుతున్నారని చెప్పారు.

మొదట్లో వెల్‌నెస్ ప్రాడక్ట్స్ పేరుతో కార్యకలాపాలు సాగించిన ఈ నెట్‌వర్క్.. ఇప్పుడు బిస్కెట్లు, తేనె వంటి సాధారణ వస్తువులను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సంస్థ పేరు చెబుతూ కార్యకలాపాలు నిర్వహించగా.. ఇప్పుడు మాత్రం పేరు చెప్పకుండా బాండ్లు రాయించుకుని పెట్టుబడులు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సెకండ్ ఇన్‌కమ్ పేరుతో ఈ మోసాలు సాగుతున్నాయి. డబ్బులు లేని వారికోసం ఫిన్‌టెక్ సంస్థల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. నిరుద్యోగులను క్యూనెట్ వలలో దించేందుకు కల్చరల్, గేమింగ్ ఈవెంట్ల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ సంస్థ ఏజెంట్లు. అలాగే గోవా, మలేషియా ట్రిప్‌లకు తీసుకువెళ్లడంతో పాటు.. కార్లు, విల్లాలు చూపిస్తూ మభ్య పెడుతున్నారు. ఫిన్‌టెక్ కంపెనీలతో మాట్లాడి లోన్‌లు కూడా వాళ్లే ఇప్పిస్తూ ఈ ఊబిలోకి దించుతున్నారు.

క్యూనెట్ బారిన పడి గత ఏడాది హరికృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ సంస్థపై 68 కేసులు నమోదు కాగా.. వాటిలో హైదరాబాద్ పరిధిలోనే 22 కేసులు ఉన్నాయి. దీంతో క్యూనెట్‌వంటి సంస్థలు ఎలాంటి స్కీమ్‌లతో వచ్చినా కూడా ప్రజలు మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రజలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అధిక లాభాల ఆశ చూపించే ఇటువంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజమైన వ్యాపారాల పేరుతో జరుగుతున్న ఈ మోసాలను గుర్తించి, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us