Telangana: యూట్యూబ్ వ్యూస్ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు. ఏం జరిగిందంటే..
వరంగల్‌కు చెందిన కొందరు యువకులు 'విలేజ్ థింగ్స్' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఛానల్‌లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ అప్‌లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో కాంట్రవర్సీగా మారింది. ఎలాగైనా వ్యూస్ రావాలనే ఉద్దేశంతో డిఫ్రెంట్ ప్రయోగం చేశారు...

సోషల్ మీడియా యుగంలో పోటీ తీవ్రంగా పెరిగింది. ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్‌లో భారీగా పోటీనెలకొంది. యూట్యూబ్‌లో లైక్‌లు, వ్యూస్ కోసం నెటిజన్లు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కాంపిటీటర్స్ కంటే ప్రత్యేకంగా కంటెంట్‌ను క్రియేట్ చేయాలని కొంగొత్త ఆలోచనలతో వీడియోలను రూపొందిస్తున్నారు. అయితే ఎలాగైనా తమ వీడియోలకు వ్యూస్, లైక్‌లు రావాలని కొందరు హద్దులు మీరుతున్నారు. క్రియేటివిటీ పేరుతో చట్టాన్ని సైతం లెక్కచేయడం లేదు. వ్యూస్ పిచ్చిలో పడి జైలు పాలైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తమ యూట్యూబ్ చానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం కొత్త రకం ఆలోచన చేసిన యువకులు జైలు పాలయ్యారు.. అది కాస్త బెడిసి కొట్టడంతో వైల్డ్ లైఫ్ కేసులో బుక్ అయ్యి రిమాండ్ కు వెళ్ళిన ఘటన ములుగు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు “విలేజ్ థింగ్స్”పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు.. చిన్న చిన్న వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వీవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. తమ యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పై ఎక్కువ వ్యూస్ రాకపోవడంతో కొత్తరకం వీడియో ఒకటి చేసి యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా ఉండాలని ఆలోచించారు.. అడవిలో వేటకు సంబంధించిన వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఆలోచించారు..
అనుకున్నదే తరువుగా ‘ అడపలతో వేట-ఇది మా ప్రాచీన పద్ధతి’ అనే టైటిల్ ఎంచుకొని అడవిలో అడపలతో అడవి కోళ్లను వేటాడం ఎలా అనే వీడియో తీశారు.. వీడియోలో అడపలతో(పెద్ద రాయి) ఉచ్చును బిగించి అందులో అడవి కోడి ఒకటి పడ్డట్టు, దాన్ని చంపి కాల్చి తింటున్నట్టు వీడియో తీసి వారి యూట్యూబ్ ఛానల్ లో 8 నవంబర్ 2022 లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాకపోగా అది కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల కంట పడింది.. అటవీశాఖ ఉన్నత అధికారుల కంట పడటంతో ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులపై ఫారెస్ట్, పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఐతే ఆ వీడియోలు తీసిన యువకులు మాత్రం మేము ఉచ్చును బిగించిన మాట వాస్తవమే కానీ అది అడవి ప్రాంతంలో కాదని, అందులో పడ్డ కోడి మా ఊరు నుండి మేము తీసుకెళ్లి ఉచ్చులో పడినట్టు చిత్రీకరించామని బుకాయించారు.. అది అడవి కోడి కాదని యూట్యూబ్ లో వ్యూస్ కోసం పెరటి కోడితో వీడియో చేస్తే ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు వారి గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఇలాంటి వీడియోలపై అటవీశాఖ అధికారులు సీరియస్ యాక్షన్ వుంటుందని హెచ్చరించారు.
వన్యప్రాణులకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ములుగు ఎఫ్ ఆర్ ఓ శంకర్ అన్నారు.. యూట్యూబ్ లో ముగ్గురు యువకులు అడవిలో అడవి కోళ్ల కోసం ఉచును బిగించిన వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినందుకుగాను వన్యప్రాన్ల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడమైనది. ఇకపై ఎవరైనా వన్యప్రాణులకు హాని కలిగించే చర్యలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..