AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC ODI World Cup 2027 : ఈసారి 10 కాదు, ఏకంగా 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేసాయ్!

ICC ODI World Cup 2027 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో 14 జట్లు పోటీ పడనున్నాయి. కొత్త ఫార్మాట్, వేదిక వివరాలు తెలుసుకుందాం.

ICC ODI World Cup 2027 :  ఈసారి 10 కాదు, ఏకంగా 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేసాయ్!
Icc Odi World Cup 2027
Rakesh
|

Updated on: Jun 12, 2026 | 2:30 PM

Share

ICC ODI World Cup 2027 : క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీ.. ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్‎కు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2027లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ తాత్కాలిక తేదీలు, వేదికలను ఐసీసీ సిద్ధం చేసింది. ఇఎస్పిఎన్ క్రిసిన్ఫో నివేదిక ప్రకారం.. ఈ మెగా టోర్నీ 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. గత మే నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరింది. దీనిపై పూర్తి స్థాయి అధికారిక ముద్రను ఈ జూలైలో ఎడిన్‌బర్గ్‌లో జరగబోయే ఐసీసీ వార్షిక జనరల్ మీటింగ్‌లో వేయనున్నారు.

మూడు దేశాల్లో వేదికలు.. సౌతాఫ్రికాలోనే ఎక్కువ

ఈ 2027 వన్డే ప్రపంచకప్‌కు బహుళ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. మొత్తం జరగబోయే 54 మ్యాచ్‌లలో ఎక్కువ మ్యాచులు సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి. అక్కడ కనీసం 8 వేర్వేరు వేదికలలో 41 మ్యాచ్‌లను ప్లాన్ చేశారు. ఇక జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ క్లబ్, విక్టోరియా ఫాల్స్ సహా 3 వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన మూడు మ్యాచ్‌లకు నమీబియా ఆతిథ్యం ఇవ్వనుంది. 2003 తర్వాత ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న మొదటి పురుషుల వన్డే వరల్డ్ కప్ ఇదే కావడం విశేషం.

జింబాబ్వేలో కొత్త స్టేడియం.. వాయిదా పడ్డ ఓపెనింగ్

ఈ మెగా టోర్నీ కోసం జింబాబ్వే ప్రభుత్వం విక్టోరియా ఫాల్స్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సరికొత్త ఫేల్ మోసి-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తోంది. ఈ మైదానంలో ఈ ఏడాది కొన్ని లోకల్ మ్యాచ్‌లను నిర్వహించి, వచ్చే ఏడాది మే నెలలో అధికారికంగా ప్రారంభించనున్నారు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికా జట్టు జింబాబ్వేలో పర్యటించి ఈ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ప్రారంభించాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.

మారుతున్న వరల్డ్ కప్ ఫార్మాట్.. 14 జట్లతో సమరం

గత రెండు ప్రపంచకప్‌లలో (2019, 2023) కేవలం 10 జట్లే బరిలోకి దిగగా, ఈసారి ఐసీసీ పాత ఫార్మాట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. 2027 టోర్నీలో మొత్తం 14 జట్లు పోటీ పడనున్నాయి. ఈ 14 జట్లను గ్రూప్‌నకు ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. లీగ్ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్ నుండి టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు, ఐసీసీ ఫుల్ మెంబర్స్ అయినందున సౌతాఫ్రికా, జింబాబ్వేలు ఈ టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. అయితే మరో హోస్ట్ కంట్రీ అయిన నమీబియా మాత్రం ఐసీసీ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడి గెలిస్తేనే మెగా టోర్నీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పైనా ఐసీసీ కీలక చర్చలు

ఈ 2027 వన్డే వరల్డ్ కప్ అనేది 2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ కింద జరగబోయే మొదటి ఐసీసీ ఈవెంట్. ఈ ఎఫ్‌టీపీ కింద ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా ఐసీసీ సిద్ధం చేస్తోంది. దీంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌ను విస్తరించడంపై కూడా ఐసీసీ అంతర్గత చర్చలు జరుపుతోంది. ఐసీసీలో ఉన్న మొత్తం 12 పూర్తి స్థాయి సభ్య దేశాలను డబ్ల్యూటీసీ పరిధిలోకి తీసుకురావాలా? లేదా? మరియు సిరీస్ కాకుండా కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడినా దాన్ని ఛాంపియన్‌షిప్ పాయింట్లలో కలపాలా? అనే విషయాలపై ఈ ఏడాది చివర్లో హాంకాంగ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us