AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..? ఈ సూపర్ టిప్స్ ఫాలో అయితే చాలు..

మనం నిత్యం వంటల్లో వాడే టమాటాలు బయట ఎర్రగా.. లోపల విషంగా మారుతున్నాయి. మార్కెట్‌లో దొరికే నిగనిగలాడే టమాటాలన్నీ సహజంగా పండినవి కావు.. రసాయనాలతో నింపిన కల్తీ టమాటాలు కూడా కావచ్చు. మరి మీరు కొనే టమాటాలో ఎంత కెమికల్ ఉందో వంటింట్లోనే సులభంగా కనిపెట్టే ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..? ఈ సూపర్ టిప్స్ ఫాలో అయితే చాలు..
How To Test Tomato Purity At Home
Krishna S
|

Updated on: Jun 12, 2026 | 1:54 PM

Share

మన వంటింట్లో టమాటా లేనిదే ఏ వంటా సాగదు. పప్పు, చారు, కూరలు, పచ్చళ్లు.. ఇలా దేనిలోనైనా టమాటా పడాల్సిందే. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనం నమ్ముతాం. కానీ ఇటీవలి కాలంలో మార్కెట్‌కు వస్తున్న టమాటాలు చూస్తే సామాన్య ప్రజలకు తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే, బయట మార్కెట్లలో ఎర్రగా, నిగనిగలాడుతూ మెరిసిపోయే టమాటాలన్నీ సహజంగా పండినవి కావు. లాభాల కోసం కొందరు వ్యాపారులు రసాయనాలతో కృత్రిమంగా పండించిన, రంగు ఇంజెక్షన్లు ఇచ్చిన కల్తీ టమాటాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఒకవేళ మీరు కొనే టమాటాలు మరీ ఎక్కువగా మెరుస్తూ, ఒకే రంగులో, రాయిలా చాలా గట్టిగా ఉంటే.. వాటి వెనుక ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మనం రోజువారీ వంటల్లో వాడే టమాటా స్వచ్ఛమైనదా? లేక కెమికల్స్ పుట్టా? అనేది ఇంట్లోనే చాలా సులభంగా గుర్తించవచ్చు.

తొక్క గట్టిదనం చూసి చెప్పేయొచ్చు

సహజంగా చెట్టుపై పండిన టమాటాలు తాకడానికి కాస్త మృదువుగా, తేలికగా నొక్కినప్పుడు మెత్తగా ఉంటాయి. కానీ రసాయనాలు ఉపయోగించి బలవంతంగా పండించిన టమాటాలు బయట ఎర్రగా కనిపించినప్పటికీ.. వాటి తొక్క చాలా గట్టిగా ఉంటుంది. అంతేకాదు ఇవి సహజమైన రుచిని కూడా కోల్పోతాయి. మార్కెట్‌లో మరీ వింతైన మెరుపుతో, ఒకే రంగులో, రాయిలా గట్టిగా ఉండే టమాటాలను కొనకపోవడమే మంచిది.

కోస్తే బయటపడే అసలు నిజం..

టమాటాను మధ్యలోకి కోసినప్పుడు లోపల ఉన్న రంగును బట్టి అది కల్తీదో కాదో ఈజీగా కనిపెట్టొచ్చు. ఒకవేళ టమాటా కోసినప్పుడు లోపల ఆకుపచ్చగా లేదా లేత రంగు మచ్చలతో అతుకుల రంగు కనిపిస్తే.. అది రసాయనాల ప్రభావమే అని గుర్తించాలి. కెమికల్స్ వల్ల బయట చర్మం ఎర్రగా మారుతుంది కానీ, లోపలి భాగం సరిగ్గా పండదు. అదే సహజమైన టమాటా అయితే లోపల, బయట ఒకే రకమైన ఎరుపు రంగులో ఉండి, విత్తనాలు కూడా చక్కగా అభివృద్ధి చెంది ఉంటాయి.

వాసన – గింజలు.. కీలక సాక్ష్యాలు..

సువాసన: సహజంగా పండిన టమాటాకు ఒక మృదువైన మట్టి వాసన లేదా కమ్మని సహజ సువాసన ఉంటుంది. అదే రసాయనాలతో పండిస్తే ఆ సువాసన అస్సలు ఉండదు.. పైగా ఒక రకమైన వింత వాసన వస్తుంది.

గింజల రంగు: టమాటా గింజలను గమనిస్తే.. సహజమైన వాటిలో గింజలు పూర్తిగా పెరిగి, గుజ్జు నుండి సులభంగా వేరుపడతాయి. అదే కల్తీ లేదా కెమికల్ టమాటాలలో గింజలు సరిగ్గా ఎదగకుండా, తెల్లగా ఉండి గుజ్జుకు గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి.

గ్లాసు నీటితో సులభమైన పరీక్ష..

ఇంట్లోనే చేసుకోగలిగే మరో చిన్న పరీక్ష ఏంటంటే.. ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో టమాటాను వేయాలి. సాధారణంగా సహజంగా పండిన, రసం నిండిన టమాటాలు బరువుగా ఉండి నీటి అడుగునకు మునిగిపోతాయి. కానీ కృత్రిమంగా, ఇంజెక్షన్ల ద్వారా పండించిన కొన్ని టమాటాలు నీటిపై తేలే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తి శాస్త్రీయ పరీక్ష కానప్పటికీ, పైన చెప్పుకున్న రూపం, వాసన, ఆకృతులతో కలిపి చూస్తే నిజం తేలిపోతుంది.

Follow Us