Telangana: పనికి వెళ్లే చోట వృద్ధ జంట ఒంటరిగా ఉండటాన్ని గమనించారు.. అంతే క్రూరులుగా మారిపోయి..
తాగుడు, జల్సాలకు అలవాటు పడి.. ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనుకడడం లేదు కొంతమంది. ఈజీ మనీకి అలవాటు పడి డబ్బే లక్ష్యంగా దారుణాలకు పాల్పడుతున్నారు...ఇలాగే తాగడానికి డబ్బులు లేవని ఓ వృద్ధ దంపతులను అత్యంత దారుణంగా చంపి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులు తీసుకొని పరారయ్యారు ముగ్గురు. కానీ పోలీసులు వారిని వదిలిపెట్టలేదు.

సిద్ధిపేట జిల్లా, నంగునూరులో మూడు రోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందిన వృద్ధ దంపతుల కేసును పోలీసులు ఛేధించారు. జల్సాలకు అలవాటు పడి, బంగారం దొంగతనం చేయాలనే దురుద్దేశంతో వృద్ద దంపతులను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురి నిందితులను అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పసుపుల సంపత్(32), మాలోతు రాజు(30), మాలోతు శ్రీకాంత్ (26) లను నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుల ముగ్గురూ కొద్ది రోజులుగా మద్యం సేవించడంతో పాటు చెడు అలవాట్లకు బానిసలయ్యారు. వీరిపై గతంలో పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. జల్సాలకు, తాగుడుకు డబ్బులు సరిపోవడం లేదని వారు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా నంగునూరు గ్రామ శివారులో కూలీ పనికి వెళ్ళినపుడు వృద్ద దంపతులు ఇద్దరే వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. వారి శరీరం మీద బంగారు, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయని గమనించారు. ఎలాగైనా ఈ దంపతుల ఒంటిపై ఉన్న బంగారాన్ని, వారి దగ్గర ఉన్న నగదును దొంగతనం చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. దంపతులు అడ్డు వస్తే వారిని చంపివేసి దోచుకోవాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం ఈ నెల రెండవ తేదీన రాత్రి ముగ్గురు నిందితులు కలిసి రెండు పల్సర్ బైక్ మీద నంగునూరు గ్రామానికి వెళ్లి ఆవుల పరశురాములు బావి వద్ద వెళ్లారు. మలోతు శ్రీకాంత్‌ను రోడ్‌పై కాపలా పెట్టి పసుపుల సంపత్, మలోత్ రాజు ఇద్దరు కలిసి వ్యవసాయ క్షేత్రం లోపలికి వెళ్లారు. కంప్రెసర్ పనికి ఉపయోగించే కట్టర్‌తో వెంటిలేటర్ ఇనుప జాలిని కింది వైపుకు కత్తిరించారు. రాజు లోపలికి దిగి గది తలుపును తెరవడంతో సంపత్ లోపలికి వెళ్లాడు. చప్పుడు విని వృద్ధ దంపతులు ఆవుల కొమరయ్య, బూదవ్వ నిద్ర లేచారు. బూదవ్వ వద్ద ఉన్న చెవి కమ్మలను, చెవి మాటీలను, కొమురయ్య దగ్గర ఉన్న వెండి మొలతాడును ఇవ్వాలని దుండగులు బెదిరించారు. దీంతో వృద్ధ దంపతులు ప్రతిఘటించారు. నిందితులను గుర్తుపట్టారు. దీంతో పోలీసులకు, వారి కుమారునికి చెబుతారనే భయంతో సంపత్ బూదవ్వ తల పట్టుకొని మంచానికి కొట్టి, గొంతు పిసికి, అక్కడే ఉన్న సిమెంట్ ఇటుకతో చాతి మీద కొట్టడంతో ఆమె చనిపోయింది. మలోతు రాజు…. కొమురయ్య మెడకు కర్చీప్ వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. అనంతరం వారి దగ్గర ఉన్న బంగారం, వెండి ఆభరణాలను తీసుకుని అక్కడి నుండి నిందితులు పారిపోయారు. దొంగిలించిన సొమ్మును అమ్మి ముగ్గురు పంచుకొన్నారు. కేసు పరిశోధనలో భాగంగా ఆదివారం సిద్దిపేట రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి బద్దిపడగ వెళ్లారు. ముగ్గురు నిందితులు బద్దిపడగ బస్టాండ్ వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి పట్టుకొని విచారించగా వృద్ధ దంపతులను చంపి.. బంగారు, వెండి ఆభరణాలు దొంగలించినట్లు నేరం ఒప్పుకున్నారు. నిందితుల వద్ద మూడు సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్ళు, వెండి మొలతాడు, రూ.30,800ల నగదు స్వాధీనం నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..