AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కారుతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించారు.. శంకరయ్య కేసులో విస్తుపోయే నిజాలు

సోదరుల మధ్య కొంత కాలంగా భూతగాదా నడుస్తోంది. కోర్టు ఓ సోదరుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మిగతా వారు రగిలిపోయారు. పోలీసులకు దొరకకుండా చంపాలని నిర్ణయించారు. అనుకున్న పని పూర్తి చేశారు కానీ.. కటకటాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Telangana: కారుతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించారు.. శంకరయ్య కేసులో విస్తుపోయే నిజాలు
Accused With Police
Ram Naramaneni
|

Updated on: Apr 07, 2025 | 2:37 PM

Share

యాక్సిడెంట్ ముసుగులో జరిగిన హత్య రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కలకలం రేపుతోంది. భూతగాదాల వివాదంలో శంకరయ్య అనే వ్యక్తిని హత్య చేశారు సోదరులు.  పథకం ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వరసకు అన్నదమ్ములు అయ్యే వ్యక్తుల మధ్య భూ తగాదా హత్యకు దారి తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆస్తి కోసం అన్నను హత్య చేసి యాక్సిడెంట్‌గా మలిచే ప్రయత్నం చేశారు, కానీ చివరకు దొరికిపోయారు. ఈ నెల రెండో తేదీన కోల్వకల్ గేట్ దగ్గర బైక్‌పై వెళ్తున్న శంకరయ్యను వెనకాల నుంచి కారుతో ఢీకొట్టి చంపారు నిందితులు.

30 ఏళ్లుగా మృతుడు గూడెపు శంకరయ్య, గూడెపు నర్సింగ్‌రావుల మధ్య భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శంకరయ్యపై గతంలోనూ దాడులకు పాల్పడ్డారు.  ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఇరుపక్షాలపై కేసులు కూడా నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం కోర్టు శంకరయ్యకు అనుకూలంగా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఆయన సోదరుల్లో ఆగ్రహం కట్ట తెంచుకుంది. శంకరయ్యను ఎలాగైన హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం ప్రశాంత్ అనే వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నారు. ప్రశాంత్‌కు ఉన్న 12 లక్షల రూపాయల అప్పు తీర్చడంతో పాటు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీనికి అంగీకరించిన ప్రశాంత్.. ఈ నెల రెండో తేదీన కోల్వకల్ గేట్ దగ్గర బైక్‌పై వెళ్తున్న శంకరయ్యను వెనకాల నుంచి కారుతో ఢీకొట్టాడు. దీంతో శంకరయ్య ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది శంకరయ్య భార్య కమల. ఈ క్రమంలో భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ పరిశీలించి.. చివరకు ఇది ప్రమాదం కాదు, హత్య అని తేల్చారు. ఈ కేసులో కొండని ప్రశాంత్, గూడెపు నర్సింగరావు, గూడెపు శ్రీనివాస్, కార్తీక్, కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. గూడెపు నర్సింగ్‌రావుకు తనకు సోదరుడి వరసయ్యే  గూడెపు శంకరయ్యను కావాలనే హత్య చేయించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..