Micro Fiber Cloth: కళ్లద్దాలు క్లీన్ చేసేందుకు ఈ క్లాత్‌నే ఎందుకు వాడతారో తెలుసా?
కళ్లద్దాలు తుడిచేందుకు ఏదైనా క్లాత్ ని వాడితే.. మరకలు పోకపోగా.. అదనంగా మరకలు పడతాయి. కానీ మైక్రో ఫైబర్ క్లాత్ అలా కాదు. దీన్ని దాదాపు అన్ని వస్తువుల క్లీనింగ్ కు వాడతారు. అసలేంటి దీని స్పెషాలిటీ? కళ్లద్దాలు క్లీన్ చేయడానికి దీన్నే ఎందుకు వాడతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్లద్దాలు వాడేవాళ్లు వాటిని క్లీన్ చేయడానికి మైక్రో ఫైబర్ అనే ఓ ప్రత్యేకమైన క్లాత్ ను వాడతారు. మామూలు క్లాత్ లో తుడిస్తే.. లెన్స్ పై మరకలు పోకపోగా మళ్లీ అదనంగా మచ్చలు పడతాయి. కానీ, మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడిస్తే మాత్రం.. ఒక్క చిన్న మరక కూడా ఉండదు. కేవలం కళ్లద్దాలకే కాదు.. దాదాపు అన్ని రకాల వస్తువులను క్లీన్ చేయడానకి మైక్రో ఫైబర్ వస్త్రాన్నే వాడతారు. ఇది లెన్స్ పూతను దెబ్బతీయకుండా దుమ్ము, నూనె , వేలిముద్రల వంటి వాటిని సులభంగా తొలగిస్తుంది. అదే దీని స్పెషాలిటీ..
మైక్రోఫైబర్ అంటే
ఈ ఫాబ్రిక్ ను మెరుగైన సింథటిక్ ఫైబర్‌తో తయారుచేస్తారు. ఈ ఫైబర్‌లు మానవ జుట్టు కంటే దాదాపు వంద రెట్లు సన్నగా ఉంటాయి. ఈ సున్నితమైన లక్షణం కారణంగా ఇది దుమ్ము, ధూళిని సులభంగా క్లీన్ చేయగలదు. ఈ మైక్రోఫైబర్ వస్త్రం చాలా మృదువుగా ఉంటుంది. పాడు చేద్దామని ట్రై చేసినా పాడవ్వదు. అందుకే దీన్ని అద్దాలపై ఉండే యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ పాడవ్వకుండా వాడతారు. సాధారణ రుమాలు లేదా టిష్యూ పేపర్ తో తుడిస్తే ఈ సున్నితమైన కోటింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. కానీ, మైక్రో ఫైబర్ క్లాత్ తో అలా జరగదు.
ఎలా పని చేస్తుంది?
మైక్రోఫైబర్ క్లాత్ తో గ్లాస్ పై రుద్దినప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది సూక్ష్మమైన ధూళి కణాలు, జిడ్డు మరకలను ఆకర్షిస్తుంది. అందుకే అద్దాలు తుడిచిన తర్వాత శుభ్రంగా మెరుస్తూ కనిపిస్తాయి. ఈ మైక్రో ఫైబర్… కాటన్ కంటే చాలా రెట్లు సున్నితంగా ఉంటుంది. దీనిని నైలాన్, పాలిస్టర్ వంటి మెటీరియల్స్ తో ప్రాసెసింగ్ చేస్తారు. వీటి తయారీలో ఎలాంటి కెమికల్స్ వాడరు. కాటన్ తో పోలిస్తే.. దీనికి చాలా ఎళ్ల మన్నిక కూడా ఉంటుంది. దీన్ని కొన్ని వేల సార్లు ఉతికినా దాని లక్షణాన్ని కోల్పోదు. పైగా ఇది చాలా త్వరగా ఆరిపోతుంది కూడా. ప్రపంచ వ్యాప్తంగా క్లీనింగ్ కోసం ఎక్కువగా వాడే మెటీరియల్ కూడా ఇదే..
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




