Smart Phone: మరో రెండు నయా బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన లావా.. ఫీచర్స్ విషయంలో తగ్గేదేలే..!
భారతదేశ హోమ్ గ్రౌండ్ బ్రాండ్ లావా తన స్టార్మ్ సిరీస్‌లో రెండు కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. రూ. 8,000 కంటే తక్కువ ధరలోనే లావా స్టార్మ్ ప్లే, లావా స్టార్మ్ లైట్‌లను పరిచయం చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 128 జీబీ వరకు నిల్వ సామర్థ్యంతో ఈ ఫోన్స్‌ను లాంచ్ చేశారు. లావా ఫోన్స్ రెడ్‌మీ, రియల్ మీ, పోకో, ఇన్‌ఫినిక్స్ వంటి కంపెనీ ఫోన్లకు గట్టి పోటినిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

లావా రిలీజ్ చేసిన స్టార్మ్ ప్లే 6 జీబీ+128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్‌ను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంచారు. అలాగే లావా స్టార్మ్ లైట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లతో కూడా రిలీజ్ చేశారు. 4 జీబీ+ 64జీబీ, 4 జీబీ + 128 జీబీ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అలాగే ఈ ఫోన్ ధరలు రూ. 7,999 నుండి ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ మొదటి సేల్ జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ఉండనుంది.
లావా స్టార్మ్ సిరీస్ స్పెసిఫికేషన్లు
లావా రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120 హెచ్‌జెడ్ అధిక రిఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. స్టార్మ్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 7060 5 జీబీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌ను వర్చువల్‌గా అదనంగా 6 జీబీ ద్వారా విస్తరించవచ్చు. మరోవైపు స్టార్మ్ లైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే వర్చువల్‌గా 4GB ద్వారా కూడా విస్తరించవచ్చు. బ్యాటరీ విషయానికొస్తే ఈ రెండు మోడల్స్ బలమైన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అలాగే స్టార్మ్ ప్లే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుండగా, స్టార్మ్ లైట్ 15వాట్స్‌కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం రెండు ఫోన్‌లు 4జీ/5 జీ సిమ్ కార్డ్ సపోర్ట్, యూఎస్‌బీ టైప్-సీ, వైఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి.
ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 15 ఆధారిత సిస్టమ్‌పై పనిచేస్తాయి. అదనంగా ఈ ఫోన్స్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. అలాగే నీరు, ధూళికి నిరోధకత కోసం ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. ఫోటోగ్రఫీ పరంగా లావా స్టార్మ్ ప్లే వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం దీనికి 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా స్టార్మ్ లైట్ వెనుక భాగంలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 ఎంపీ కెమెరాతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








