IPL 2026 : చరిత్ర సృష్టించిన గిల్-సుదర్శన్ జోడి.. కోహ్లీ, డివిలియర్స్ రికార్డులు బ్రేక్
IPL 2026 : ఐపీఎల్ 2026లో గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ రికార్డులను బద్దలు కొట్టి నయా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో 600 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్లు వీరిద్దరే కావడం విశేషం.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడి శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు చెలరేగి ఆడి సరికొత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. కేవలం 12.2 ఓవర్లలోనే 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ పునాది వేయడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జోడీగా అవతరించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాల రికార్డులను సైతం వీరు బద్దలు కొట్టారు.
విరాట్ కోహ్లీ, డివిలియర్స్ రికార్డులు బద్ధలు
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 10 సెంచరీ భాగస్వామ్యాలు (100 పరుగుల పార్ట్నర్షిప్స్) నెలకొల్పిన జోడీగా శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల లిస్టులో విరాట్ కోహ్లీ – ఏబీ డివిలియర్స్ జోడి అగ్రస్థానంలో ఉండేది. అయితే కోహ్లీ-డివిలియర్స్ జోడి 10 సెంచరీ భాగస్వామ్యాలు చేయడానికి 77 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, గిల్-సుదర్శన్ జోడి కేవలం 46 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. దీంతో దిగ్గజాల రికార్డులను అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ యువ జోడి తుడిచిపెట్టేసింది.
ఓపెనింగ్ జోడిగా సరికొత్త రికార్డు
ఐపీఎల్లో ఒక ఓపెనింగ్ జోడిగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన రికార్డు కూడా ఇప్పుడు గిల్-సుదర్శన్ సొంతమైంది. ఓపెనర్లుగా ఈ జోడికి ఇది 7వ సెంచరీ భాగస్వామ్యం. దీనితో వారు గతంలో ఆరు సెంచరీ భాగస్వామ్యాలతో రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్ – శిఖర్ ధావన్, అలాగే ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మల రికార్డులను అధిగమించారు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, స్థిరమైన ఓపెనింగ్ జోడిగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆరెంజ్ క్యాప్ కోసం ఇద్దరి మధ్యే పోటీ
ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతనికి సమానంగా సాయి సుదర్శన్ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో 600 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్లు వీరిద్దరే కావడం విశేషం. ప్రస్తుతం లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో (ఆరెంజ్ క్యాప్ రేస్) వీరిద్దరూ టాప్-2 స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు ఆరెంజ్ క్యాప్ కోసం ఇలా పోటీ పడటం ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
