Cricket: క్రికెట్ లో విషాదం.. గుండెపోటుతో ఆ పాకిస్తానీ మాజీ అంఫైర్ కన్నుమూత..

క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన ఐసీసీ ప్యానల్ మాజీ అంపైర్ అసద్‌ రవూఫ్‌ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. లాహోర్‌లో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. అసద్ రవూఫ్..

Cricket: క్రికెట్ లో విషాదం.. గుండెపోటుతో ఆ పాకిస్తానీ మాజీ అంఫైర్ కన్నుమూత..
Asad Rauf
Follow us

|

Updated on: Sep 15, 2022 | 11:38 AM

Cricket: క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన ఐసీసీ ప్యానల్ మాజీ అంపైర్ అసద్‌ రవూఫ్‌ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. లాహోర్‌లో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. అసద్ రవూఫ్ 2006 నుంచి 2013 వరకు ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ అంపైర్‌గా పనిచేశారు. రవూఫ్‌ తొలిసారి 2000 సంవత్సరంలో వన్డేలకు, 2005 నుంచి టెస్ట్‌ మ్యాచ్‌లకు అంపైరింగ్‌ మొదలుపెట్టారు. కెరీర్‌లో మొత్తం 64 టెస్టులు, 139 వన్డేలు, 28 టీ20లు, 11 మహిళల టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశారు. వీటితో పాటు భారత్‌లో జరిగే టీ20 లీగ్‌ సహా పలు మ్యాచ్‌ల్లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. పాకిస్తాన్‌ నుంచి అలీమ్‌ దార్‌ తర్వాత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అసద్‌ రౌఫ్‌ భారత్ లో ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా పనిచేశారు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలను అసద్‌ రౌఫ్‌ ఎదుర్కొన్నారు. అసద్‌ రౌఫ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. బుకీల నుంచి అసద్ రౌఫ్ ఖరీదైన బహుమతుల్ని స్వీకరించి.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు రాగానే BCCI అతడ్ని పక్కన పెట్టి విచారణకి ఆదేశించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. సమర్థవంతమైన అంపైర్‌గా ఉండటమే కాకుండా అసద్ రవూఫ్ పాకిస్థాన్‌లో ప్రఖ్యాత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా ఆడాడు. 71 ఫస్ట్ క్లాస్, 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో  రౌఫ్ మూడు సెంచరీలు, 26 ఆఫ్ సెంచరీలు చేశాడు. తన కెరీర్‌లో లాహోర్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ రైల్వేస్, పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల తరపున క్రికెట్ ఆడారు.

నిషేధం ముగిసినప్పటికి అంపైర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. బీసీసీఐ ఇచ్చిన షాక్‌కు అంపైరింగ్‌ వదిలేసిన అసద్‌ రౌఫ్‌ లాహోర్‌లోనే ఒక బట్టల షాపు నిర్వహించడం అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తానీ మాజీ అంఫైర్ అసద్ రవూఫ్‌ మరణానికి పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌ రాజా ట్విటర్‌లో సంతాపం తెలిపారు. రవూఫ్‌ మరణవార్త కలచివేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆయన మంచి అంపైర్‌, హాస్యచతురత ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అసద్ రవూఫ్ ను చూస్తేనే తన మొహంపై చిరునవ్వు మెరుస్తుందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తన సంతాప సందేశంలో తెలిపారు. పాక్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ కూడా రవూఫ్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎంతో మంది క్రికెటర్లు సైతం అసద్ రవూఫ్ మరణంపై సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..