బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్ కాదు.. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఆ డేంజర్ బౌలర్ రావాల్సిందే
2027 వన్డే ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఒక సీనియర్ బౌలర్ పునరాగమనం జట్టుకు ఎంత అవసరమో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. ఆ వివరాలు ఇలా..

టీమిండియా గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నప్పటికీ, అందరి కళ్లు ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నాయి. 2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే ప్రపంచ కప్ ముద్దాడలేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది చివరి అవకాశం కావచ్చు. అయితే, జట్టు విజయతీరాలకు చేరాలంటే బ్యాటింగ్ ఎంత ముఖ్యమో, బౌలింగ్ అంతకంటే కీలకం. ప్రస్తుతం ఉన్న బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌలర్లు ప్రతిభావంతులే అయినప్పటికీ, ఒత్తిడిలో వారు తడబడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అవసరం జట్టుకు ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ తన మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి తానెంటో నిరూపించుకున్నారు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడంలో భూవీకి ఉన్న నైపుణ్యం ఇప్పటికీ తగ్గలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే 21 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉండటం విశేషం. కేవలం వికెట్లు తీయడమే కాకుండా, పొదుపుగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఆయనది అందెవేసిన చేయి.
2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత సెలెక్టర్లు భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టేశారు. కానీ జట్టులో అనుభవజ్ఞులైన బౌలర్లు లేకపోవడం వల్ల కీలక మ్యాచ్‌ల్లో భారత్ ఇబ్బంది పడుతోంది. 2027 ప్రపంచ కప్ జరగబోయే పిచ్‌లపై భూవీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు భూవీ కూడా చేరితే భారత పేస్ దళం మరింత పటిష్టంగా మారుతుంది. యువ బౌలర్లు అర్ష్‌దీప్, హర్షిత్ రాణా వంటి వారికి భూవీ గైడెన్స్ ఎంతో అవసరం. సెలక్షన్ కమిటీ ఇప్పటికైనా కళ్లు తెరిచి, కేవలం వయసును కాకుండా ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో చోటు కల్పించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
