Bronco Test : గంభీర్ మరో కీలక నిర్ణయం.. 6 నిమిషాల్లో 1.2 కి.మీ.. బ్రాంకో టెస్ట్ అంటే ఏమిటి?
క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి భారత క్రికెట్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రగ్బీ క్రీడకు సంబంధించిన బ్రోంకో టెస్ట్ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్ ఆటగాళ్ల ఏరోబిక్ సామర్థ్యం, స్టామినా, మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండే శక్తిని పెంచడానికి రూపొందించారు.

Bronco Test : క్రికెటర్ల ఫిట్‌నెస్ పెంచడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక కొత్త, ముఖ్యమైన అడుగు వేసింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇకపై బ్రాంకో టెస్ట్ అనే కొత్త ఫిట్‌నెస్ పరీక్షను తప్పనిసరి చేసింది. ఇది రగ్బీ క్రీడలో ఉపయోగించే ఒక ఫిట్‌నెస్ పరీక్ష. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆటగాళ్లలో ఏరోబిక్ సామర్థ్యం, స్టామినా, మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పెంచడం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఇకపై కేవలం జిమ్‌పై ఆధారపడకుండా, రన్నింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరీక్షను 6 నిమిషాల్లో పూర్తి చేయాలి.
బ్రోంకో టెస్ట్ అంటే ఏమిటి?
ఈ బ్రోంకో టెస్ట్‌ను తీసుకురావడం వెనుక బీసీసీఐ ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది. భారత ఆటగాళ్లు జిమ్‌లో ఎక్కువ సమయం గడపకుండా, మైదానంలో ఎక్కువగా పరుగెత్తాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ టెస్ట్ ఇప్పటికే మొదలైంది.
బ్రోంకో టెస్ట్‌లో మూడు దశలు ఉంటాయి. ఒక ఆటగాడు మొదట 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. ఆ తర్వాత 40 మీటర్లు, 60 మీటర్లు పరుగెత్తాలి. ఈ మొత్తం ఒక సెట్‌గా పరిగణించబడుతుంది, దీనిలో మొత్తం దూరం 240 మీటర్లు. ఆటగాడు ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. మొత్తం దూరం 1200 మీటర్లు అవుతుంది. ఈ టెస్ట్‌ను ఆటగాడు ఎక్కడా ఆగకుండా 6 నిమిషాల్లో పూర్తి చేయాలి.
గంభీర్ ఆమోదం..
ఈ బ్రోంకో టెస్ట్‌ను టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆండ్రియన్ లే రాక్స్ సూచించారు. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి అంగీకరించారు. నివేదికల ప్రకారం, చాలామంది ఆటగాళ్లు ఇప్పటికే బెంగళూరు వెళ్లి ఈ టెస్ట్‌ను పూర్తి చేశారు.
“బ్రాంకో టెస్ట్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రారంభించారు. భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ఒక స్పష్టమైన ప్రమాణాన్ని నిర్ధారించడానికి ఈ టెస్ట్‌ను ఉపయోగిస్తున్నారు. భారత క్రికెటర్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు, సరిపడా పరుగు పెట్టడం లేదని, జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారని గమనించారు. ఇకపై ఆటగాళ్లు తమ శిక్షణలో రన్నింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా సూచించారు” అని ఒక వర్గం తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




