Shubman Gill: అకాడమీ నుంచి శుభ్మన్ గిల్ బహిష్కరణ.. ఎందుకో తెలుసా?
Team India Captain Shubman Gill Expelled From the Academy: ఆసియా కప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మాన్ గిల్, ఏ అభిమానికి తెలియని ఒక విషయాన్ని వెల్లడించాడు. తాను చిన్నతనంలో అకాడమీ నుంచి బహిష్కరించబడ్డానని గిల్ షాక్ ఇచ్చాడు.

Shubman Gill Expelled From the Academy: శుభ్‌మాన్ గిల్ నేడు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. కానీ ఒకప్పుడు అతన్ని క్రికెట్ అకాడమీ నుంచి బయటకు పంపేవారని తెలుసా? ఈ విషయాన్ని శుభ్‌మాన్ గిల్ స్వయంగా వెల్లడించాడు. గిల్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తనకు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, తన తండ్రి తనను ఒక పబ్లిక్ అకాడమీలో చేర్పించాడని, అక్కడ తన తండ్రి కోచ్‌తో గొడవ పడ్డాడని, ఆ తర్వాత తనను బయటకు పంపించేశాడని చెప్పుకొచ్చాడు. ఆ అకాడమీకి వెళ్లాలంటే రాత్రి 3 గంటలకు లేవాల్సి వచ్చిందని శుభ్‌మాన్ గిల్ తెలిపాడు.
రాత్రి 3 గంటలకే నిద్ర లేచి..
ఆపిల్ మ్యూజిక్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ, ‘నా తొలినాళ్లలో, నా తండ్రి అకాడమీ కోచ్‌తో గొడవ పడ్డాడు. అతను మమ్మల్ని అకాడమీ నుంచి బహిష్కరించాడు. ఆ అకాడమీ ఒక పబ్లిక్ అకాడమీ, అది ప్రైవేట్ కాదు. కోచ్ మమ్మల్ని ఉదయం 6 నుంచి 10 వరకు ప్రాక్టీస్ చేయించేవాడు. ఆ తరువాత సాయంత్రం 4 నుంచి 6 వరకు ప్రాక్టీస్ చేయించేవాడు. ఇందుకోసం నాన్న నన్ను రాత్రి 3 గంటలకు నిద్రలేపేవారు. నేను ప్రాక్టీస్ తర్వాత పాఠశాలకు వెళ్లి, సగం రోజు సెలవు తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్‌కు వెళ్లేవాడిని. నేను కొన్ని సంవత్సరాలు ఇలా చేశాను. కానీ, అది పెద్ద సవాలు లాంటిది. కొన్నిసార్లు రాత్రి 3 గంటలకు మేల్కొనడానికి ఇబ్బంది వచ్చేది. కానీ నన్ను ఇలా చేయమని బలవంతం చేసిన నాన్నకు నేను కృతజ్ఞుడను’ అంటూ చెప్పుకొచ్చాడు.
11 ఏళ్ల వయసులోనే..
11 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నానని శుభ్‌మాన్ గిల్ తెలిపాడు. 2010లో గిల్ అండర్ 23 మ్యాచ్ ఆడాడు. అక్కడ 90 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ప్రత్యర్థులు అతని కంటే రెట్టింపు వయసు వారు. ఇదే విషయంపై శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే, నాకు 11 ఏళ్ల వయసులో, నేను ప్రొఫెషనల్ కావాలని కోరుకుంటున్నానని నాకు తెలుసు. నాకు 11 ఏళ్ల వయసులో, అండర్ 23 క్యాంప్ ఉండేది, అక్కడ బౌలర్లు నా కంటే రెట్టింపు వయసు వారు. వారికి బ్యాటర్స్ కొరత ఉంది. నన్ను 7, 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపేవారు. కానీ మా నలుగురు-ఐదుగురు బ్యాటర్స్ త్వరగానే ఔట్ అయ్యారు. ఆ తర్వాత నేను బ్యాటింగ్‌కు వెళ్లాను. నేను 90 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాను‘ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








