IND vs ENG: ఐపీఎల్ ట్రోఫీ కంటే అక్కడ టెస్ట్ సిరీస్ గెలవడమే కీలకం: శుభ్‌మాన్ గిల్
Shubman Gill Press Conference: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సందర్భంగా, కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బౌలింగ్‌పై ప్రాధాన్యత, టెస్ట్ సిరీస్ గెలవడం, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు, వ్యక్తిగత లక్ష్యాలు, జట్టు అనుభవంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Shubman Gill Press Conference: భారత్, ఇంగ్లాండ్ (India vs England) మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ రేపు, జూన్ 20న ప్రారంభం కానుంది. రెండు జట్ల తొలి మ్యాచ్‌కు లీడ్స్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, టీం ఇండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. టెస్ట్ క్రికెట్‌లో తొలిసారిగా టీం ఇండియాకు నాయకత్వం వహిస్తున్న గిల్, జట్టుపై ఎటువంటి ఒత్తిడి లేదని అన్నారు. ఈ సిరీస్‌లో బాగా రాణించడమే నా లక్ష్యం. టెస్ట్ గెలవడానికి నేను బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.
5 టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20, శుక్రవారం నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు, జూన్ 19, గురువారం, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. టెస్ట్ కెప్టెన్‌గా ఏదైనా సిరీస్‌కు ముందు ఇది అతని మొదటి విలేకరుల సమావేశం. అయితే, ఇంగ్లాండ్‌కు బయలుదేరే ముందు, అతను ముంబైలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో విలేకరుల సమావేశం నిర్వహించాడు. కానీ, సిరీస్‌కు ముందు అతను ఒంటరిగా మీడియాతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఈ విలేకరుల సమావేశంలో గిల్ మాట్లాడిన ఈ 5 విషయాల గురించి సమాచారం ఓసారి చూద్దాం..
ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు..
“20 వికెట్లు తీయకుండా టెస్ట్ మ్యాచ్ గెలవలేరు. కాబట్టి, మేం బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నాం. అంటే, 20 వికెట్లు తీయడానికి బ్యాటింగ్ విభాగాన్ని తగ్గించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే, బ్యాటింగ్ ఆల్ రౌండర్‌కు బదులుగా పూర్తి స్థాయి బౌలర్‌ను ఎంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని గిల్ స్పష్టం చేశాడు.
టెస్ట్ సిరీస్ ప్రాముఖ్యత గురించి గిల్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం ఐపీఎల్ గెలవడం కంటే పెద్ద విజయం అని అన్నారు. ఐపీఎల్ ప్రతి సంవత్సరం వస్తుంది. మనకు ప్రతి సంవత్సరం అవకాశం లభిస్తుంది. కానీ, టెస్ట్ సిరీస్ గెలవడం దానికంటే పెద్దదని గిల్ అన్నారు.
నంబర్ 3 బ్యాటింగ్ స్థానం గురించి గిల్ మాట్లాడుతూ, “మనం మళ్ళీ పిచ్‌ను చూసి, ఆపై నంబర్ 3 స్థానాన్ని నిర్ణయిస్తాం. విరాట్ భాయ్ రిటైర్మెంట్ తర్వాత, గౌతమ్ గంభీర్, నేను మాట్లాడుకుని నంబర్ 4లో ఆడాలని నిర్ణయించుకున్నాం” అని అన్నాడు.
“నేను బ్యాటింగ్‌కు వెళ్ళేటప్పుడు, నేను బ్యాట్స్ మాన్‌గా మాత్రమే ఆడాలనుకుంటున్నాను, కెప్టెన్సీ గురించి ఆలోచించను. ఎందుకంటే, అది ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ సిరీస్‌లో నేను అత్యుత్తమ బ్యాట్స్ మాన్ అవ్వాలనుకుంటున్నాను” అని అతను తెలిపాడు.
జట్టు అనుభవం గురించి మాట్లాడుతూ, గిల్ మాట్లాడుతూ, “మేం గత ఫలితాలను చూడం. చాలా మంది మేం అనుభవం లేనివారమని చెబుతున్నారు. దాని అర్థం గత ఫలితాల ఒత్తిడి మోస్తున్నామని కాదు” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








