39 సిక్సర్లు, 14 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ.. టీ20 హిస్టరీకే చెమటలు పట్టించిన భారత బ్యాటర్.. ఎవరంటే?
Mohit Ahlawat Triple Century: ఇంతటి భారీ రికార్డు సృష్టించినా, మోహిత్ అహ్లావత్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. గౌతమ్ గంభీర్, అమిత్ మిశ్రా వంటి దిగ్గజాలు రాటుదేలిన లాల్ బహదూర్ శాస్త్రి క్రికెట్ అకాడమీ నుంచి వచ్చిన మోహిత్, దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, సర్వీసెస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Mohit Ahlawat Triple Century: టీ20 క్రికెట్ అంటేనే మెరుపు వేగం.. ఫోర్లు, సిక్సర్ల హోరు. కానీ, ఒకే మ్యాచ్‌లో ఒక బ్యాటర్ ట్రిపుల్ సెంచరీ (Triple Century) బాదడం ఎప్పుడైనా విన్నారా? ఇది వినడానికి ఏదో సినిమా కథలా లేదా వీడియో గేమ్ లా అనిపించవచ్చు. కానీ, ఒక భారతీయ యువ బ్యాటర్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. కేవలం 72 బంతుల్లోనే 300 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
72 బంతుల్లో 300 పరుగులు.. అసాధారణ ఇన్నింగ్స్..!
2017 ఫిబ్రవరి 7న ఢిల్లీలో జరిగిన ఒక స్థానిక టీ20 టోర్నమెంట్‌లో ఈ సంచలనం నమోదైంది. మావీ XI వర్సెస్ ఫ్రెండ్స్ XI జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మోహిత్ అహ్లావత్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. సాధారణంగా టీ20ల్లో సెంచరీ చేయడమే గొప్ప విషయం, కానీ మోహిత్ ఏకంగా 300 పరుగులు చేసి రికార్డు పుస్తకాలను తిరగరాశాడు.
సిక్సర్ల వర్షం: 39 సిక్సర్లు, 14 ఫోర్లు..
మోహిత్ అహ్లావత్ ఇన్నింగ్స్ చూస్తే బౌలర్లు ఎంతలా వణికిపోయారో అర్థం చేసుకోవచ్చు. అతను మొత్తం 39 సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. అంటే కేవలం సిక్సర్ల రూపంలోనే 234 పరుగులు రాబట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మోహిత్, తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. కేవలం 21 ఏళ్ల వయసులో అతను చూపించిన ఈ ‘రౌద్ర అవతారం’ క్రికెట్ ప్రేమికులను షాక్‌కు గురిచేసింది.
వీడియో గేమ్‌ను తలపించిన టీమ్ స్కోరు..
మోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని, మావీ XI జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 416 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో కూడా ఇలాంటి స్కోర్లు ఊహకందనివి. లక్ష్య చేధనలో ఫ్రెండ్స్ XI జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా మావీ XI 216 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
రికార్డుల రారాజు.. కానీ వెలుగులోకి రాని కెరీర్..
అయితే, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. జనవరి 2025లో జరిగిన తన చివరి దేశవాళీ మ్యాచ్‌లో కేవలం ఒక పరుగుకే అవుటవ్వడం గమనార్హం. టీ20 చరిత్రలో ఒక అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటగాడు, ప్రస్తుతం లైమ్ లైట్ కు దూరంగా ఉన్నాడు. క్రికెట్ ఎంత అనిశ్చితమైనదో చెప్పడానికి మోహిత్ అహ్లావత్ కథే ఒక నిదర్శనం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.



