Team India: టీమిండియాకు బిగ్ షాక్.. తెలుగబ్బాయ్‌కి ఎమర్జెన్సీ సర్జరీ.. టీ20 వరల్డ్ కప్‌నకు డౌటే..?
Tilak Varma Surgery: టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు న్యూజిలాండ్ జట్టుతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు ఎంపికైన తెలుగు తేజం తిలక్ వర్మను ఈ సిరీస్ నుంచి తప్పించే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tilak Varma Surgery: టీమిండియా యువ బ్యాటర్, ఆసియా కప్ హీరో తిలక్ వర్మ ఒక్కసారిగా ఆసుపత్రి పాలవ్వడం క్రీడా లోకాన్ని షాక్‌కు గురిచేసింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతనికి అత్యవసరంగా సర్జరీ నిర్వహించారు. దీంతో రానున్న న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
హైదరాబాద్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. రాజ్‌కోట్‌లో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి (అబ్డామినల్ పెయిన్) వచ్చింది. వెంటనే టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి ‘టెస్టిక్యులర్ టోర్షన్’ (Testicular Torsion) అనే సమస్య ఉన్నట్లు గుర్తించి, వెంటనే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతనికి సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం..
జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దాదాపు దూరమయ్యాడు. గత ఏడాది కాలంగా టీ20ల్లో తిలక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో అతను ఆడిన 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ అతన్ని జట్టులో కీలక ఆటగాడిగా మార్చింది. ఇటువంటి సమయంలో అతను దూరమవ్వడం జట్టు సమతూకాన్ని దెబ్బతీసే అంశం.
వరల్డ్ కప్ ముంగిట ఆందోళన..
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. వైద్యుల సమాచారం ప్రకారం, ఈ సర్జరీ తర్వాత కోలుకోవడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. దీనివల్ల వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. ఫిట్‌నెస్ సాధించినా, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం సెలెక్టర్లకు సవాలుగా మారనుంది.
ప్రత్యామ్నాయం ఎవరు?
తిలక్ వర్మ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. శ్రేయస్ అయ్యర్ లేదా రియాన్ పరాగ్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే శుభ్‌మన్ గిల్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
తిలక్ వర్మ త్వరగా కోలుకుని వరల్డ్ కప్‌లో భారత్ తరపున బరిలోకి దిగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.



