RCB vs KKR, IPL 2022: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు విజయం.. మరోసారి ఆకట్టుకున్న డీకే..

ఐపీఎల్ 2022 ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)పై విజయం సాధించింది . 129 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది

RCB vs KKR, IPL 2022: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు విజయం.. మరోసారి ఆకట్టుకున్న డీకే..
Rcb Vs Kkr
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2022 | 12:31 AM

ఐపీఎల్ 2022 ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)పై విజయం సాధించింది . 129 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ మరోసారి ధాటిగా ఆడాడు. ఆఖరి ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌ బాది తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన హసరంగ వేలంలో తనకు దక్కిన రూ.10. 75 కోట్లకు తగిన న్యాయం చేశాడు. అందుకే అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం దక్కింది. హసరంగతో పాటు ఆకాశ్ దీప్ మూడు, హర్షల్ పటేల్ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు. కాగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరుకు పేలవమైన ఆరంభం లభించింది. 2.1 ఓవర్లలో 17 పరుగులకే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. ఓపెనర్లు డుప్లెసిస్‌ (5), అనుజ్‌ రావత్‌ (0), విరాట్‌ కోహ్లీ (12) పూర్తిగా నిరాశపర్చారు. అయితే షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27 పరుగులు చేయడంతో మళ్లీ బెంగళూరు పోటీలోకి వచ్చింది. ఆఖరులో దినేష్ కార్తీక్ (14 నాటౌట్‌), హర్షల్ పటేల్ (10 నాటౌట్‌) వేగంగా పరుగులు సాధించడంతో లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ తరఫున టిమ్ సౌథీ 20/3, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. IPL 2022లో RCBకి ఇది తొలి విజయం కాగా కేకేఆర్‌కు తొలి పరాజయం.

నిర్లక్ష్యంగా ఆడి..

కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పోగొట్టుకున్నారు. ఆకాశ్ దీప్ తన తొలి బంతికే వెంకటేష్ అయ్యర్ వికెట్‌ తీయగా, ఐదో ఓవర్‌లో అజింక్యా రహానెను పెవిలియన్‌కు పంపి మహ్మద్ సిరాజ్ కేకేఆర్‌ను రెండో దెబ్బ తీశాడు. ఇక తొలి బంతికే సిక్సర్‌ బాది ఆశలు రేపిన నితీశ్ రాణా (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇక హసరంగ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫాఫ్ డు ప్లెసిస్‌కి చేతికి చిక్కడంతో కోల్‌ కతా కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సునీల్‌ నరైన్‌ (12), షెల్డన్ జాక్సన్‌ (0) లను హసరంగ ఔట్‌ చేయడంతో తొమ్మిది ఓవర్లలో 67 పరుగులకే కేకేఆర్ ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఆండ్రీ రస్సెల్ (18 బంతుల్లో 25), ఉమేష్ యాదవ్ (18), వరుణ్‌ చక్రవర్తి (10) కొన్ని పరుగులు సాధించడంతో 128 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాదించింది. కాగా ఆర్సీబీ బౌలర్ల ధాటికి రెండుసార్లు మాజీ చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా 57 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం . ఉమేష్, వరుణ్‌లు 10 వికెట్‌కు నెలకొల్పిన 27 పరుగులే KKR జట్టులో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. హసరంగ (20/4) కోల్‌కతా బ్యాటింగ్‌ను కకావికలం చేయగా, ఆకాశ్‌దీప్‌ (45/3), హర్షల్‌ పటేల్‌ (11/2) సత్తా చాటారు. కాగా ఈ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ వేసిన హర్షల్‌ ఏకంగా రెండు మొయిడెన్‌ ఓవర్లు వేయడం విశేషం.

Also Read:Andhra Pradesh: కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలనుకున్నారు..‌ మధ్యలో ఊహించని ట్విస్ట్‌.. దెబ్బకు ఫ్యూజులు ఔట్..!

Punjab CM: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. స్కూళ్లలో ఫీజుల పెంపుపై నిషేధం

Telangana: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. స్కూళ్ల పనివేళలు కుదింపు.. షెడ్యూల్ ఇదే