AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది రా.. రోహిత్‌ రేంజు! రూ.275 లేని పేదరికం నుంచి ఇప్పుడు అరుదైన గౌరవం వరకు.. హిట్‌మ్యాన్‌ స్టోరీ!

రోహిత్ శర్మ అనే క్రికెటర్ 275 రూపాయల స్టైఫండ్ తో ప్రారంభించి, వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ తో గుర్తింపు పొందాడు. అతని పేదరికం నుండి విజయం వరకు ప్రయాణం, అతని క్రికెట్ ప్రతిభను ఈ వ్యాసం వివరిస్తుంది. ప్రస్తుత ఫామ్‌లో లేకపోయినప్పటికీ, అతని గొప్పతనాన్ని క్రికెట్ అభిమానులు తెలుసుకోవాల్సిన అసవరం ఉంది.

ఇది రా.. రోహిత్‌ రేంజు! రూ.275 లేని పేదరికం నుంచి ఇప్పుడు అరుదైన గౌరవం వరకు.. హిట్‌మ్యాన్‌ స్టోరీ!
Rohit
Follow us
SN Pasha

|

Updated on: Apr 16, 2025 | 7:20 PM

ఫామ్‌ ఈజ్‌ టెంపరరీ, క్లాస్‌ ఈజ్‌ పర్మినెంట్‌.. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోయి కాస్త ఇబ్బంది పడుతున్న సమయంలో, వాళ్లు మళ్లీ ఫామ్‌ అందుకున్న టైమ్‌లో మాట వాడుతుంటారు. అది అక్షర సత్యం. క్రికెట్‌ గురించి మాట్లాడుకుంటే.. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు.. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి వేల పరుగులు చేసి, పదుల సంఖ్యలో సెంచరీలు చేసి, ఎన్నో మ్యాచ్‌లను వంటి చేత్తో గెలిపించి, తమ దేశాన్ని అంతర్జాతీయ వేదికల్లో విశ్వవిజేతగా నిలిపిన తర్వాత కూడా కొన్ని సార్లు కెరీర్‌ చివరి దశలో వాళ్ల స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతుంటారు. దాంతో.. సహజంగానే విమర్శలు కూడా వస్తుంటాయి. రన్స్‌ చేయలేనప్పుడు రిటైర్మెంట్‌ ఇచ్చేయొచ్చు కదా అంటూ కొంతమంది కాస్త ఘాటుగా రియాక్ట్‌ అవుతుంటారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం రోహిత్‌ శర్మ విషయంలో కూడా ఇలాంటి విమర్శలే ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఐపీఎల్‌ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న రోహిత్‌ శర్మ సరైన ఫామ్‌లో లేడని, రన్స్‌ చేయలేకపోతున్నాడని, జట్టుకు భారంగా మారాడంటూ హిట్‌మ్యాన్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఒక పక్క వినిపిస్తున్న టైమ్‌లోనే.. అసలు రోహిత్‌ శర్మ అంటే ఎవరో తెలిసేలా.. ఎంసీఏ ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్‌ శర్మ పేరు పెడుతున్నట్లు వెల్లడించింది. ఎంతో చరిత్ర కలిగిన వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు పేరు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ముంబై నుంచి ఎంతో మంది క్రికెటర్లు వచ్చినా.. అది కొద్ది మందికి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ఆ గౌరవం రోహిత్‌ శర్మకు కూడా దక్కుతుంది. రోహిత్‌ పేరు మీద ఓ స్టాండ్‌కు నామకరణం చేయనున్నారు.

ఇప్పటికే వాంఖడేలో క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు మరి కొంతమంది దిగ్గజాల పేరుతో స్టాండ్స్‌ ఉన్నాయి. ఇక నుంచి రోహిత్‌ శర్మ స్టాండ్‌ కూడా దర్శనమివ్వనుంది. రోహిత్‌ శర్మకు దక్కుతున్న ఈ అరుదైన గౌరవానికి రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇది రా రోహిత్‌ రేంజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ.. రోహిత్‌పై వచ్చే విమర్శలకు సమాధానం ఇస్తున్నారు. నిజానికి ఇప్పుడు వాళ్ల సంతోషంలో అర్థం, వాళ్ల కోపానికి కారణం ఉంది. ఎందుకంటే.. రోహిత్‌ శర్మ చాలా మంది క్రికెటర్లలా కాదు.. చాలా పేదరికం నుంచి పైకొచ్చిన ఆటగాడు. తల్లిదండ్రులకు భారమై.. అమ్మమ్మ ఇంట్లో ఉండి పెరిగిన బిడ్డ. స్కూల్‌ ఫీజు కోసం కనీసం 275 రుపాయాలు కూడా లేని కడు పేదరికం నుంచి ఈ స్థాయికి చేరుకున్న రోహిత్‌ శర్మ కచ్చితంగా ఎంతో మందికి స్ఫూర్తి. రోహిత్‌ శర్మ ఓ స్కూల్‌ తరఫున క్రికెట్‌ ఆడుతుంటే దినేస్‌ లాడ్‌ అనే ఓ పెద్ద స్కూల్‌ కోచ్‌ చూశాడు. అప్పుడే రోహిత్‌లోని టాలెంట్‌ను అతను గుర్తించాడు.

ఇలాంటి కుర్రాడు తమ స్కూల్‌ టీమ్‌లో ఉంటే తమతో పాటు ఆ కుర్రాడి కెరీర్‌కు కూడా హెల్ప్‌ అవుతుందని అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా.. వెంటనే మ్యాచ్‌ అయిపోయిన తర్వాత రోహిత్‌ను తమ స్కూల్‌కు మారాల్సిందా కోరాడు. అందుకు రోహిత్‌ శర్మ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అంత ఫీజు నేను కట్టలేను సార్‌ అని. ఆ స్కూల్‌ ఫీజ్‌ ఎంతో తెలుసా? కేవలం 275 మాత్రమే. అప్పట్లో 275 అంటే ఎక్కువేనో అని మీరు అనుకోవచ్చు. నిజమే.. అది రోహిత్‌ శర్మ కుటుంబానికి చాలా పెద్ద విషయం. అయితే.. రోహిత్‌ ఆటకు ఫిదా అయిపోయిన దినేష్‌ లాడ్‌, ఎలాగైన రోహిత్‌ను తమ స్కూల్‌లో చేర్పించాలని, రోహిత్‌ కోసం స్కాలర్‌షిప్‌ మంజూరు చేయాలని స్కూల్‌ మేనేజ్‌మెంట్‌కు రిక్వెస్ట్‌ చేశాడు. దినేష్‌ లాడ్‌ రిక్వెస్ట్‌తో రోహిత్‌ శర్మకు రూ.275 స్టైఫండ్‌ ఇచ్చేందుకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అంగీకరించింది. ఆ 275 రూపాయల స్టైఫండ్‌ రోహిత్‌ జీవితాన్ని మార్చేసింది. అతనికి ఉన్న నేచురల్‌ టాలెంట్‌కు దినేష్‌ లాడ్‌ మరింత పదును పెట్టారు.

అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. ముంబై టీమ్‌కు, అలాగే టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఆరంభంలో విఫలమైనా.. అతని టెక్నిక్‌కు సెలెక్టర్లు, భారత క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. వాస్తవానికి కెరీర్‌ ఆరంభంలో రోహిత్‌ చాలా అవకాశాలు ఇచ్చారు. విరాట్‌ కోహ్లీ కంటే ముందే రోహిత్‌ టీమిండియాలోకి వచ్చినా.. కోహ్లీ తర్వాత టీమిండియాకు కెప్టెన్‌ అయ్యాడు. ఎందుకంటే.. కెరీర్‌ ఆరంభంలో తడబడిన రోహిత్‌.. కొంత కాలం తర్వాతే టీమిండియాలో పాతుకుపోయాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌ ఆడిన రోహిత్‌కు, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో మాత్రం స్థానం దక్కలేదు. అయినా కూడా నిరాశ చెందకుండా.. ఆ తర్వాత అసలు సిసలు రోహిత్‌ శర్మను బయటికి తెచ్చాడు. బీసీసీఐ, సెలెక్టర్లు, భారత ఆటగాళ్లు.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు రోహిత్‌ శర్మ.

తన 275 రుపాయాల స్టైఫండ్‌ను గుర్తుకు తెస్తూ.. ఏ క్రికెటర్‌ కూడా కనీసం కలలో నైనా ఊహించని 264 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. అది ఇప్పటికీ ప్రపంచపు బెస్ట్‌ వన్డే ఇన్నింగ్స్‌. అలాగే కెప్టెన్‌ అయిన తర్వాత.. టీమిండియాకు ఒక టీ20 వరల్డ్‌ కప్‌, ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించాడు. తన కెప్టెన్సీలో టీమిండియా 2023లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ ఆడింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ అయిన తర్వాత చరిత్రంతా మీకు తెలిసిందే. కానీ, రోహిత్‌ స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేసింది మాత్రం.. టీమిండియాలోకి రాకముందు, వచ్చిన ఆరంభంలో. అదే రోహిత్‌ శర్మను ఓ స్ట్రాంగ్‌ ప్లేయర్‌గా మార్చింది. అలాంటి పరిస్థితులు చూసి వచ్చిన ఆటగాడు.. ఇప్పుడు తనపై ఉన్న అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడి ఉండొచ్చు కాక.. కానీ, కమ్‌ బ్యాక్‌ ఇస్తే.. ఒక సునామీ మీద పడినట్లు ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అందుకే.. ఫామ్‌ ఇజ్‌ టెంపరరీ, క్లాస్‌ ఇజ్‌ పర్మినెంట్‌.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..