RCB : చెన్నై, ముంబైలను వెనక్కి నెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్సీబీ.. ఇక ఐపీఎల్లో నంబర్ వన్ ఇదే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టుగా చెన్నై, ముంబైలను వెనక్కి నెట్టింది. ఐపీఎల్ మొత్తం బ్రాండ్ విలువ 18.5 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రకటనల ఆదాయం, వ్యూయర్‌షిప్‌లో రికార్డులు సృష్టించింది. తాజా టీమ్ బ్రాండ్ విలువ ర్యాంకింగ్‌లను ప్రకటించారు.

RCB : ఐపీఎల్లో ఇప్పుడు ప్రస్తుత సంచలనం..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అత్యంత విలువైన జట్టుగా అవతరించింది. కిందటి సారి అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను వెనక్కి నెట్టి ఆర్సీబీ నంబర్ వన్‌గా నిలిచింది. హౌలిహాన్ లోకే అనే సంస్థ చేసిన తాజా బ్రాండ్ వాల్యుయేషన్ అధ్యయనం ప్రకారం.. 2025లో ఐపీఎల్ ఆర్థికంగా ఊహించని విధంగా భారీ వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిలో భాగంగానే ఆర్సీబీ అత్యంత విలువైన జట్టుగా మారింది. ఐపీఎల్ మొత్తం బిజినెస్ వ్యాల్యూ ఏడాదికి 12.9శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.56ట్రిలియన్లు) కు చేరుకుంది. దీనితో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుందని హౌలిహాన్ లోకే బ్రాండ్ వాల్యుయేషన్ అధ్యయనం తెలిపింది.
అంతేకాదు, ఐపీఎల్ టోర్నమెంట్‌కు వస్తున్న రికార్డు స్థాయి ప్రేక్షకుల సంఖ్య, పెరుగుతున్న ప్రకటనల ఆదాయం, పెట్టుబడిదారుల నుండి వస్తున్న బలమైన ఆసక్తి వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ వ్యాల్యూ 13.8శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్లు(సుమారు రూ.32,721కోట్లు)కు చేరుకుందని ఇదే నివేదికలో పేర్కొన్నారు. ఫ్రాంచైజీ ర్యాంకింగ్‌లలో చాలా పెద్ద మార్పులు జరిగాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటిసారిగా ఛాంపియన్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ, తన బ్రాండ్ విలువను బాగా పెంచుకుంది. దీనితో చెన్నై సూపర్ కింగ్స్‌ను వెనక్కి నెట్టింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విలువైన జట్టుగా మారింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను వెనక్కి నెట్టి ఆర్సీబీ మొదటి స్థానానికి చేరింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ 2024లో 227 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,894 కోట్లు) ఉండగా, ఇప్పుడు అది 269 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2,246 కోట్లు) పెరిగింది. దీనితో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఛాంపియన్ జట్లను కూడా దాటేసింది. ముంబై ఇండియన్స్ 242 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2,021 కోట్లు) తో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 235 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,963 కోట్లు) తో మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, ఈసారి ఐపీఎల్లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ బ్రాండ్ విలువలో ఏకంగా 39.6శాతం భారీ పెరుగుదలను సాధించింది. దీనితో వారి మొత్తం విలువ 141 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.1,178 కోట్లు) పెరిగింది.
ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రకటనల ఆదాయం 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,000 కోట్లు) దాటింది. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 50% ఎక్కువ. My11Circle, Angel One, RuPay, CEAT వంటి సంస్థలతో బీసీసీఐ కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా రూ.1,485 కోట్లు వచ్చాయి. అలాగే, టాటా టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను 2028 వరకు రెన్యూ చేయడం వల్ల 300 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2,505 కోట్లు) ఆదాయం లభించిందని హౌలిహాన్ లోకే నివేదికలో పేర్కొన్నారు.
ఐపీఎల్ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. మొదటి వీకెండ్‌లో జియోసినిమాలో 1.37 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను 678 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా చూసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.
IPL టీమ్‌ల బ్రాండ్ విలువలు (రూపాయల్లో): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – సుమారు రూ.2,246 కోట్లు ముంబై ఇండియన్స్ – సుమారు రూ.2,021 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ – సుమారు రూ.1,963 కోట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ – సుమారు రూ.1,894 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ – సుమారు రూ.1,286 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ – సుమారు రూ.1,269 కోట్లు రాజస్థాన్ రాయల్స్ – సుమారు రూ.1,219 కోట్లు గుజరాత్ టైటాన్స్ – సుమారు రూ.1,186 కోట్లు పంజాబ్ కింగ్స్ – సుమారు రూ.1,178 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ – సుమారు రూ.1,019 కోట్లు
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..




