Sydney Test: ఎవరు వచ్చిన రాకున్నా నేను మాత్రం వస్తా! ఇలాగయితే మనకు కష్టమే భయ్యా.!
సిడ్నీ టెస్ట్ వర్షం ప్రభావంతో కష్టాల్లో పడే అవకాశం ఉంది. నాల్గవ, ఐదవ రోజులు ముఖ్యంగా ఆటకు ఆటంకం కలిగించనున్నాయి. భారత జట్టు కీలక బ్యాటర్లు విఫలమవ్వగా, జస్ప్రీత్ బుమ్రా మాత్రం అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. భారత్ ఈ టెస్ట్ గెలిచేందుకు కఠిన పోరాటం చేయాల్సి ఉంది.
సిడ్నీ టెస్ట్ వేదికపై వాతావరణం గడ్డు పరీక్షగా నిలుస్తుందని తెలుస్తోంది. ఐకానిక్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారతదేశం-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు జనవరి 3న ప్రారంభమవుతోంది. కానీ ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వరసగా నాల్గవ, ఐదవ రోజులు వర్షం ప్రభావానికి గురయ్యే అవకాశముందని విజ్డెన్ నివేదిక తెలిపింది. ఈ మ్యాచ్ జేన్ మెక్‌గ్రాత్ డే సందర్భంగా ప్రత్యేకంగా జరగనుంది, ఇది క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం.
గూగుల్ వెదర్, BBC వాతావరణ నివేదికల ప్రకారం, తొలి రోజు తక్కువ మేఘాలు ఉండగా, రెండవ రోజు ప్రకాశవంతమైన ఆకాశం కనిపిస్తుంది. అయితే నాల్గవ రోజున సాయంత్రం నుంచి వర్షం ప్రారంభమవుతుందనీ, ఐదవ రోజు ఇది మరింత తీవ్రంగా ఉండనుందని అంచనా.
ఇదిలా ఉండగా, భారత్ జట్టు ప్రధాన బ్యాటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రాణించడంలో విఫలమవడంతో, జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ చేసినప్పటికీ, జట్టు మొత్తం ప్రదర్శన లోపించింది. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్ల గాయాలు వారి జట్టును కూడా బలహీనం చేసాయి, ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్ లేని పరిస్థితిలో జట్టు కొద్దిగా సన్నగిల్లినట్టయ్యింది.
ఈ టెస్ట్ భారత్‌కు కీలకమైనది. ఈ మ్యాచ్ గెలవడమే వారికి సిరీస్‌ను డ్రా చేయడమేకాక, వచ్చే WTC ఛాంపియన్‌షిప్ రేసులో నిలవడానికి చావో రేవో సమరం అవుతుంది.