Ubaidullah Rajput : పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..త్రివర్ణ పతాకం పట్టుకున్నందుకు లైఫ్ టైమ్ బ్యాన్?
Ubaidullah Rajput : భారత జెర్సీ ధరించి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్‌పై పాక్ ఫెడరేషన్ అనిశ్చిత కాల నిషేధం విధించింది. బహ్రెయిన్ టోర్నీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది.

Ubaidullah Rajput : పాకిస్థాన్‌కు చెందిన ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు టీమిండియా జెర్సీ ధరించి, భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూనడం ఇప్పుడు ఆ దేశంలో చిచ్చు రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ కబడ్డీ ఫెడరేషన్, ఆ ఆటగాడిపై జీవితకాలం లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అనిశ్చిత కాల నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ కబడ్డీ స్టార్ ఉబైదుల్లా రాజ్‌పుత్ చిక్కుల్లో పడ్డాడు. ఈ నెల ప్రారంభంలో బహ్రెయిన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కబడ్డీ టోర్నమెంట్‌లో అతను పాల్గొన్నాడు. అయితే అక్కడ రాజ్‌పుత్ ఏకంగా భారత జట్టు తరపున బరిలోకి దిగడమే కాకుండా, ఇండియా అని రాసి ఉన్న జెర్సీని ధరించాడు. ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత భారత జెండాను తన భుజాలపై వేసుకుని సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్‌లో తీవ్ర దుమారం రేగింది.
ఈ వ్యవహారంపై పాకిస్థాన్ కబడ్డీ ఫెడరేషన్ శనివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశం దాటి వెళ్లే ముందు ఫెడరేషన్ నుంచి ఎటువంటి ఎన్ఓసీ తీసుకోలేదని, పైగా శత్రు దేశంగా భావించే భారత్ జెర్సీని ధరించి దేశ గౌరవానికి భంగం కలిగించాడని ఆరోపిస్తూ అతనిపై నిషేధం విధించింది. పాకిస్థాన్ కబడ్డీ ఫెడరేషన్ సెక్రటరీ రాణా సర్వర్ మాట్లాడుతూ.. రాజ్‌పుత్ చర్యలు క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట అని, అతను తన వివరణను కమిటీ ముందు చెప్పుకోవచ్చని తెలిపారు. కేవలం రాజ్‌పుత్ మాత్రమే కాకుండా, అనుమతి లేకుండా ఆ టోర్నమెంట్‌లో పాల్గొన్న మరికొందరు ఆటగాళ్లపై కూడా జరిమానాలు విధించారు.
Pakistan Kabaddi Federation has imposed ban on Pakistani player Ubaidullah Rajput for representing Indian team in Bahrain Kabaddi Cup. Rajput has right to appeal but disciplinary committee is unlikely to grant any relief#Kabaddi #PakistanKabaddi pic.twitter.com/bA2t7Av3ze
— Shakeel Khan Khattak (@ShakeelktkKhan) December 27, 2025
నిషేధంపై రాజ్‌పుత్ స్పందిస్తూ తన వైపు నుంచి క్షమాపణలు కోరాడు. “బహ్రెయిన్‌లో జరిగే ఒక ప్రైవేట్ క్లబ్ టీమ్ తరపున ఆడమని నన్ను ఆహ్వానించారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ టీమ్ పేరును ఇండియన్ టీమ్ అని మార్చారు. నేను నిర్వాహకులతో గొడవ పడ్డాను, దేశం పేరు వాడవద్దని కోరాను. గతంలో కూడా పాక్, భారత్ ఆటగాళ్లు కలిసి ప్రైవేట్ టీమ్స్ తరపున ఆడారు, కానీ ఇలా దేశం పేరుతో ఆడటం పొరపాటున జరిగింది. నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు” అని రాజ్‌పుత్ వాపోయాడు. అయితే, భారత జెండాను కప్పుకున్న దృశ్యాలు స్పష్టంగా ఉండటంతో అతని వాదనను ఫెడరేషన్ ప్రాథమికంగా తోసిపుచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
