సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?
Mumbai Indians captaincy: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ప్రక్షాళనకు సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా స్థానంలో కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడిన ఆ జట్టులో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముందుగా యువ సంచలనం తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించినా, ఇప్పుడు అనూహ్యంగా భారత స్టార్ బౌలర్ అతడికి గట్టి పోటీదారుడిగా కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు.

Mumbai Indians Captaincy: హార్దిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. ఈ చెత్త ప్రదర్శనతో అభిమానులతో పాటు యాజమాన్యం కూడా తీవ్ర అసంతృప్తికి లోనైంది. దీంతో జట్టులో సమూల మార్పులు చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు పంపించి (ట్రేడింగ్), ఆ బాధ్యతలను యువ సంచలనం తిలక్ వర్మకు అప్పగించాలనే వార్తలు జోరుగా వినిపించాయి. ఫ్రాంచైజీ తరఫున నిలకడగా రాణిస్తున్న తిలక్‌కు సారథ్య బాధ్యతలు ఇస్తారని అంతా భావించారు.
ఇప్పటి వరకు తిలక్ వర్మ వైపే ముంబై యాజమాన్యం మొగ్గు చూపుతోందని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు కూడా కెప్టెన్సీ రేసులో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా జట్టును వీడితే, దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బుమ్రాను సారథిగా చేయాలని ఫ్రాంచైజీ యోచిస్తోంది. యువ ఆటగాడైన తిలక్ వర్మపై ఇప్పుడే కెప్టెన్సీ భారం వేస్తే, అది అతని సహజమైన దూకుడు బ్యాటింగ్ శైలిపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని ముంబై థింక్ ట్యాంక్ ఆందోళన చెందుతోంది. అందుకే బుమ్రా లాంటి సీనియర్, అనుభవజ్ఞుడైన ఆటగాడి చేతిలో పగ్గాలు పెట్టాలని భావిస్తోంది. పైగా, ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌పై ఒక మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించి అద్భుత విజయాన్ని అందించిన ట్రాక్ రికార్డ్ కూడా అతనికి కలిసిరానుంది.
మరోవైపు టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీ అతన్ని దీర్ఘకాలిక ఎంపికగా పరిగణించడం లేదు. పైగా అతను ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. కేవలం తాత్కాలిక ఎంపికగా సూర్యను చూడటం కంటే బుమ్రా లేదా తిలక్ వర్మలకే యాజమాన్యం ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం త్వరలో లండన్‌లో అత్యవసరంగా సమావేశమై జట్టు భవిష్యత్తు ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు కోచింగ్ స్టాఫ్, ముఖ్యంగా హెడ్ కోచ్ మహేల జయవర్ధనే పనితీరుపై కూడా కఠిన సమీక్ష జరగనుంది. అంతేకాకుండా, హార్దిక్ పాండ్యాతో పాటు ముంబై జట్టుకు చెందిన మరో మాజీ కెప్టెన్ కూడా ట్రేడింగ్ ద్వారా వేరే జట్టుకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ జట్టుకే ముఖచిత్రంగా ఉన్నందున, ఆ ట్రేడింగ్ అయ్యే ఆటగాడు బహుశా సూర్యకుమార్ యాదవ్ కావచ్చని క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ, ఐపీఎల్ 2027 నాటికి ముంబై ఇండియన్స్ సరికొత్త రూపురేఖలతో, కొత్త సారథితో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కిరీటం అనుభవజ్ఞుడైన బుమ్రాను వరిస్తుందా, లేక భవిష్యత్ ఆశాకిరణం తిలక్ వర్మకు దక్కుతుందా అనేది లండన్ సమావేశం తర్వాత అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. అప్పటివరకు అభిమానుల్లో ఈ ఉత్కంఠ కొనసాగక తప్పదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




