Virat Kohli: ఆ విషయంలో ధోని కంటే కోహ్లీనే గొప్ప! భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సంచలన స్టేట్‌మెంట్
విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో 84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాను గెలిపించాడు. కపిల్ దేవ్ కోహ్లీని ధోనితో పోల్చారు, ఛేజింగ్‌లో కోహ్లీ ఒక అడుగు ముందున్నాడని అన్నారు. కోహ్లీ ఛేజింగ్ నైపుణ్యం, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం, భాగస్వామ్యాలు నిర్మించడం, ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయడం గురించి వివరించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. చాలా క్లిష్టమైన పిచ్‌పై 265 పరుగుల టార్గెట్‌ను ఎలా ఛేజ్ చేయాలో.. చేసి చూపించాడు కింగ్ కోహ్లీ. పవర్ ప్లే లోపలే టీమిండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయినా కూడా మిడిల్డార్ బ్యాటర్లలో అద్భుతమైన పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పుతూ.. తనకు ఛేజ్ మాస్టర్ అనే బిరుదు ఎందుకు వచ్చిందో మరోసారి నిరూపించాడు. ఆసీస్‌పై ఆడిన ఆ 84 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత యావత్ ప్రపంచం జయహో కోహ్లీ అంటూ అభినందించింది. తాజాగా టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్, 1989 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు.
పైగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కోహ్లీని కంప్యార్ చేస్తూ.. ధోని కంటే కోహ్లీనే ఒక అడుగు ముందు ఉన్నాడంటూ పేర్కొన్నాడు. కపిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీకి ఇలాంటి పెద్ద పెద్ద మ్యాచ్ లంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద ఛాలెంట్ ఎదురైతే అతను అంత బాగా ఆడతాడు. ఛేజ్ మాస్టర్ అనే మాటకు న్యాయం చేస్తూ వస్తున్నాడు. పైగా మ్యాచ్‌ను ఛేజింగ్ చేస్తూ ఎలా గెలిపించాలో అతనికి బాగా తెలుసు. చాలా సార్లు అతను అది చేసి చూపించారు. గతంలో ధోని కూడా ఇలానే చేసేవాడు. అయితే ఈ విషయంలో మాత్రం అందరికంటే కోహ్లీనే ఒక అడుగు ముందు ఉంటాడు” అని కపిల్ పాజీ అన్నారు.
మ్యాచ్ కండీషన్స్‌ను అర్థం చేసుకొని, ముఖ్యంగా ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఎలా ఆడాలి, ఎలా భాగస్వామ్యాలు నిర్మించాలి, ఎప్పుడు ఇన్నింగ్స్‌ను యాక్సలరేట్ చేయాలి, ఎలా ముగించాలో ధోనికి బాగా తెలుసని గతంలో చెప్పుకునేవాళ్లు. ధోని ఆ తర్వాత రన్ మెషీన్‌గా మారిన కోహ్లీ ఆ పని చేస్తున్నాడు. అయితే ఛేజింగ్‌లో కోహ్లీకి ఉన్న రన్స్, విన్ పర్సంటేజ్ అతన్ని ఈ విషయంలో అందరికంటే ముందు ఉంచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్‌ను మరొక్క మ్యాచ్‌లో కూడా కంటిన్యూ చేస్తే.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంటుంది. ఈ నెల 9న న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఇలాగే ఆడి టీమిండియాను గెలిపించి, ఛాంపియన్‌గా నిలపాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




