మీరూ, మీ చెత్త ప్లాన్స్.. బంగారంలాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Jasprit Bumrah injury: స్టార్ ఆటగాళ్లను నిరంతరం కాపాడుకోవడంలో యాజమాన్యం సరైన ప్రణాళికలు రూపొందించకపోతే భవిష్యత్తులో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇకనైనా సెలెక్టర్లు, జట్టు పెద్దలు ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Jasprit Bumrah Injury: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదే పదే గాయాల బారిన పడుతుండటం వెనుక అసలు బాధ్యులు ఎవరు? టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిభారం తగ్గించడంలో కెప్టెన్, కోచ్, సెలెక్టర్లు దారుణంగా విఫలమయ్యారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మరోసారి దూరమైన ప్రధాన అస్త్రం..
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సమరానికి భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత నెల ఇంగ్లాండ్ పర్యటనలో చివరి వన్డే సందర్భంగా మోకాలికి తగిలిన దెబ్బ పాత గాయాన్ని మళ్లీ తిరగదోడింది. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గలేకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది.
ఆ ముగ్గురిదే పూర్తి బాధ్యత..
బుమ్రాను మేనేజ్ చేస్తున్న తీరుపై మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ వేదికగా స్పందిస్తూ.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కేవలం ఆటగాడి శారీరక స్థితిని మాత్రమే వివరిస్తుందని, తుది నిర్ణయాలు తీసుకునేది కెప్టెన్, హెడ్ కోచ్, సెలెక్టర్ల త్రయమేనని గుర్తుచేశారు. బుమ్రాపై మితిమీరిన పనిభారం మోపడం వల్లే అతడు దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్నాడని ఆయన కుండబద్దలు కొట్టారు.
వరుస గాయాలతో డగౌట్ సంక్షోభం..
ప్రస్తుతం భారత శిబిరాన్ని కేవలం బుమ్రా గాయం మాత్రమే వేధించడం లేదు. యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ సైతం గాయాల బారిన పడి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరికి మ్యాచ్‌ల సమయంలో అనుకోకుండా దెబ్బలు తగిలినా, సుందర్ లాంటి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై నిరంతర పర్యవేక్షణ కొరవడిందని బద్రీనాథ్ విశ్లేషించారు.
పర్యవేక్షణ లోపమే కొంపముంచుతోందా?
అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ఆటగాళ్లకు శారీరక శ్రమ సహజమే అయినా, విరామాలు ఇవ్వకుండా బరిలోకి దింపడం ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. భారత క్రికెట్ బోర్డు (BCCI) చేపడుతున్న వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ముఖ్యమైన టోర్నీలు ముంచుకొస్తున్న సమయంలో ప్రధాన బౌలర్ల గైర్హాజరు జట్టు కూర్పును తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




