కొత్త టెక్నాలజీ తో షియామీ వాషింగ్ మెషీన్! దుస్తులు ఎంత త్వరగా ఎండిపోతాయి అంటే ఆశ్చర్యపోతారు
వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతికిన తర్వాత వాటిని ఆరబెట్టడం చాలా మందికి మరో సమస్యగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ ఇబ్బంది మరింత పెరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా షియోమీ కొత్త హీట్ పంప్ వాషర్ డ్రైయర్‌ను చైనాలో విడుదల చేసింది. వేగంగా ఆరబెట్టడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా ఇందులో ప్రత్యేక డ్రైయింగ్ టెక్నాలజీని అందించారు.

బట్టలు ఉతకడం, ఆరబెట్టడం రెండూ ఒకే మెషీన్‌లో చేయాలనుకునేవారికి కొత్త మోడళ్లు ఉపయోగపడుతున్నాయి. షియోమీ తీసుకొచ్చిన ఈ ప్రీమియం మోడల్‌లో 13 కేజీల వాషింగ్ సామర్థ్యం, 9 కేజీల డ్రైయింగ్ సామర్థ్యం ఉన్నాయి. AI ఆధారిత నియంత్రణలు, 35 వాషింగ్ ప్రోగ్రామ్‌లు, ఫోన్ ద్వారా నియంత్రించే సదుపాయం కూడా ఇందులో ఉన్నాయి.
తక్కువ విద్యుత్ వినియోగం
Mijia Washing Machine with Delicate Wash Pro Supreme Edition పేరుతో వచ్చిన ఈ మోడల్‌లో హీట్ పంప్ టెక్నాలజీ ప్రధాన ప్రత్యేకత. మెషీన్‌లో ఉత్పత్తి అయ్యే వేడిని తిరిగి ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని 73 శాతం వరకు తగ్గించవచ్చని కంపెనీ చెబుతోంది. పైభాగంలో ఏర్పాటు చేసిన డ్యూయల్ ఫ్యాన్ వ్యవస్థ వల్ల బట్టలు 49 శాతం వేగంగా ఆరుతాయని పేర్కొంది.
ఒకేసారి 13 కేజీల బట్టలను ఉతకవచ్చు. డ్రైయింగ్ కోసం 9 కేజీల సామర్థ్యం ఉంది. ఉతకడం, ఆరబెట్టడం కోసం కలిపి 35 ప్రోగ్రామ్‌లు అందించారు. మొండి మరకలను తొలగించేందుకు Super Electrolysis టెక్నాలజీని ఉపయోగించారు. చల్లటి నీటితో ఉతికినా 99 శాతం వరకు క్రిములను తొలగించే సామర్థ్యం ఉందని సంస్థ చెబుతోంది. రంగులు మారకుండా, తెల్లటి దుస్తులు పసుపు రంగులోకి మారకుండా శుభ్రం చేసేలా దీనిని రూపొందించారు.
AIతో స్మార్ట్ వాషింగ్..
ఇందులో AI ఆధారిత అల్గారిథమ్స్ ఉన్నాయి. వేసిన బట్టల రకం, మరకలను బట్టి సరైన వాషింగ్ ప్రోగ్రామ్‌ను సూచించేలా ఇది పనిచేస్తుంది. Xiaomi Home యాప్ ద్వారా ఫోన్ నుంచే మెషీన్‌ను నియంత్రించవచ్చు. వాషింగ్ ఎంతవరకు పూర్తయిందో కూడా మొబైల్‌లో చూడొచ్చు.
చైనాలో ఈ మోడల్ ధర దాదాపు రూ.75,000గా ఉంది. ప్రస్తుతం అక్కడ మాత్రమే విక్రయిస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భారత్‌కు వస్తే ప్రీమియం వాషర్ డ్రైయర్ విభాగంలో దీనికి పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
