AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా ఓటమికి అసలు కారణం ఆ ‘మాయే’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

IPL Blamed For India T20 Loss: సూర్యకుమార్ యాదవ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ప్రయాణాన్ని ఆశించిన అభిమానులకు ఈ పర్యటన తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయితే, ఈ ఓటమి ఒక రకంగా కళ్ళు తెరిపించే నిజం. ఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేవలం వాణిజ్య ప్రకటనలు, వీక్షకుల సంఖ్య కోసమే కాకుండా, క్రీడా ప్రమాణాలను పెంచే విధంగా ఐపీఎల్‌లో మార్పులు తీసుకురావాలని ఆశిద్దాం.

టీమిండియా ఓటమికి అసలు కారణం ఆ 'మాయే'.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!
Ipl Blamed For India T20 Loss
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 11:46 AM

Share

IPL Blamed For India T20 Loss: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20 జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయం క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు దశాబ్దాల తర్వాత వరుస సిరీస్‌లలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, నంబర్ వన్ టీ20 ర్యాంకును కూడా కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ ఓటములకు కేవలం ఆటగాళ్లను లేదా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పుపట్టడం సరికాదని, దీని వెనుక ఐపీఎల్ సృష్టించిన కృత్రిమ వాతావరణమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు బాహాటంగా విమర్శిస్తున్నారు.

ఆటగాళ్లను కాదు.. ఐపీఎల్‌ను నిందించండి..!

భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఈ ఘోర ఓటమిపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. విదేశీ గడ్డపై ఎదురైన ఈ పరాభవానికి ఆటగాళ్లను బాధ్యులను చేయడం చాలా సులువైన విషయమని, కానీ అసలు తప్పు ఐపీఎల్ నిర్వాహకులదేనని ఆయన తేల్చి చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే పిచ్‌లు భారతీయ బ్యాటర్లపై ‘భారీ మేకప్’ వేస్తాయని, అది వారి అసలు ప్రతిభను దాచిపెట్టి, లేని గొప్పదనాన్ని చూపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ఇచ్చే ఈ నకిలీ భరోసా వల్లే విదేశాల్లో పిచ్‌లు కాస్త స్పందించినా మన బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

ఇవి కూడా చదవండి

సరుకు లేని ఫ్లాట్ పిచ్‌లు.. దెబ్బకొట్టిన బౌన్స్..

ఐపీఎల్‌లో వీక్షకులను ఆకర్షించేందుకు, వాణిజ్య ప్రయోజనాల కోసం పిచ్‌లను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చదునైన పిచ్‌లు, చిన్న బౌండరీలు ఉండటంతో బ్యాటర్లు కేవలం బంతి వేగాన్ని వాడుకుంటూ భారీ స్కోర్లు సాధిస్తున్నారు. కానీ, ఇంగ్లాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లో బంతి స్వింగ్, బౌన్స్ అయినప్పుడు ఆ టెక్నిక్ ఏమాత్రం పనిచేయడం లేదు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి ఇంగ్లాండ్ పేసర్లు సంధించిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో మన యువ ఆటగాళ్లు తీవ్రంగా తడబడ్డారు. క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్ నిర్మించే ఓపిక లేకపోవడం, కేవలం ఒకే గేరులో పవర్‌ హిట్టింగ్ ఆడాలనుకోవడం భారత్ కొంపముంచింది.

ఆల్‌రౌండర్ల ప్రతిభను చంపేస్తున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం..

భారత జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల కొరత ఏర్పడటానికి ఐపీఎల్‌లోని వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమమే కారణమని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వంటి వారు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ నిబంధన వల్ల జట్లు ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను వాడుకుంటున్నాయి. దీనివల్ల బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేయగల ఆటగాళ్లను ప్రోత్సహించే ధోరణి తగ్గిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా మినహా నమ్మదగిన ఆల్‌రౌండర్ జట్టులో కరువయ్యారు.

ఇది కూడా చదవండి: అన్నీ గుండు సున్నాలే.. టీమిండియాను సర్వ నాశనం చేసిన ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోతది..!

సెలెక్టర్లకు కఠినమైన హెచ్చరిక..

రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువగా విదేశీ పర్యటనలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో సాధించిన భారీ పరుగులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, విదేశీ పిచ్‌లపై ఆడే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఐపీఎల్ అందించే సొంతగడ్డ వినోదం ముగిసిందని, ఇకనైనా కఠినమైన పిచ్‌లపై రాణించే జట్టును సిద్ధం చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us