అన్నీ గుండు సున్నాలే.. టీమిండియాను సర్వ నాశనం చేసిన ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోతది..!
Sunil Gavaskar Comments Team India Defeat: వరల్డ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్, వరుసగా రెండు సిరీస్‌లలో ఘోరంగా వైట్‌వాష్ అవ్వడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం ఒక కారణమైనప్పటికీ, మేనేజ్‌మెంట్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేము. త్వరలోనే తప్పులను సరిదిద్దుకుని, సరికొత్త వ్యూహాలతో టీమిండియా మళ్లీ పాత ఫామ్‌ను అందుకోవాలని ఆశిద్దాం.

Sunil Gavaskar Comments Team India Defeat: ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్‌లోనూ చేతులెత్తేసిన టీమిండియా, 56 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్‌స్వీప్ చేసి, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుకు దూసుకెళ్లింది. ఈ అవమానకర ఓటములపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహరహిత నిర్ణయాలపై గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒక్కరు విఫలమైతే ఫామ్.. జట్టు మొత్తం విఫలమైతే మీదే తప్పు!
ఈ దారుణ ఓటమి అనంతరం సునీల్ గావస్కర్ ఒక క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్‌లను కడిగిపారేశారు. “టీమిండియాను నడిపించడం మీకు ఏమైనా కొత్తా? కనీస అనుభవం లేదా? పిచ్, పరిస్థితులకు తగ్గట్లుగా ప్రణాళికలు రచించడం చేతకాదా?” అంటూ నిలదీశారు. జెట్టులో ఎవరో ఒకరు విఫలమైతే అది ఫామ్ లోపమని సరిపెట్టుకోవచ్చని, కానీ జట్టు మొత్తం నిరంతరాయంగా విఫలమవుతోందంటే దానికి ముమ్మాటికీ కెప్టెన్, కోచ్ మాత్రమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు . కేవలం ఆటగాళ్లను అటు ఇటు మార్చడం తప్ప, మ్యాచ్ గెలవడానికి మీ దగ్గర పక్కా వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలోనూ గంభీర్-అయ్యర్ పర్యవేక్షణలో టీమిండియాను పూర్తిగా ‘గుండు సున్నా’గా మార్చేశారంటూ గావస్కర్ నిప్పులు చెరిగారు.
ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్
బోర్డుపై పరుగులు కాదు.. పరుగుల వరద..!
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ కలిసి భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఏకంగా 233 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు లేని లోటు భారత బౌలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
బౌలర్ల దారుణ వైఫల్యం.. ఫీల్డింగ్ ఘోరం..!
భారత యువ ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ అక్షర్ పటేల్, పేసర్ ప్రిన్స్ యాదవ్ ఇద్దరూ కలిసి ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నారు. ఇంగ్లాండ్ చేసిన మొత్తం స్కోరులో సగం పరుగులు వీరిద్దరి ఓవర్లలోనే రావడం గమనార్హం. దీనికి తోడు చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడవడం భారత్ కొంపముంచింది.
షార్ట్ పిచ్ బంతులకు వణికిపోయిన బ్యాటర్లు..!
అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ విసిరిన పదునైన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. షార్ట్ బాల్స్ వస్తున్నాయంటేనే క్రీజులో బ్యాటర్లు వణికిపోతున్నట్లు కనిపించిందని, సరైన ఫుట్‌వర్క్ లేకపోవడంతోనే వికెట్లు పారేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




