AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Captains Report : ఐపీఎల్ 2026 కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్.. నలుగురు కెప్టెన్లు సూపర్.. నలుగురు అట్టర్ ఫ్లాప్

IPL 2026 Captains Report : ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో 10 టీమ్ కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్. శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్ అదరగొడుతుంటే, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయితే ఏ జట్టు ప్రదర్శన అయినా ఆ టీమ్ కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది.

IPL 2026 Captains Report : ఐపీఎల్ 2026 కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్.. నలుగురు కెప్టెన్లు సూపర్.. నలుగురు అట్టర్ ఫ్లాప్
Ipl 2026 Captains
Rakesh
|

Updated on: May 03, 2026 | 1:49 PM

Share

IPL 2026 Captains Report : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ స్టేజ్ సగం ముగిసేసరికి కొన్ని జట్లు ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతుంటే, మరికొన్ని జట్లు వెనుకబడిపోయాయి. అయితే ఏ జట్టు ప్రదర్శన అయినా ఆ టీమ్ కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్‌లో కొంతమంది కెప్టెన్లు తగ్గేదే లే అన్నట్లు ఆడుతుంటే, మరికొందరు మాత్రం అటు బ్యాటింగ్ లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. 10 జట్ల కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్ ఎలా ఉందో చూద్దాం.

1. శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్)

శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తలరాతను మార్చేశాడు. గత సీజన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న పంజాబ్, ఈసారి శ్రేయాస్ కెప్టెన్సీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రేయాస్ 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 309 పరుగులు చేశాడు. 61.80 సగటుతో, 174 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ నాలుగు హాఫ్ సెంచరీలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

2. రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఊచకోత కోయడం ఇతని ప్రత్యేకత. 9 మ్యాచ్‌ల్లో 257 పరుగులు చేసిన ఇతని స్ట్రైక్ రేట్ ఏకంగా 200 దాటడం విశేషం. ఆర్సీబీ టాప్-4లో ఉండటానికి రజత్ బ్యాటింగే ప్రధాన కారణం.

3. ఇషాన్ కిషన్/ప్యాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతంగా పుంజుకుంది. కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 312 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాలను ఇచ్చాడు. కమిన్స్ వచ్చాక కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు కానీ బౌలింగ్‌లో ఇంకా మంచి ఫామ్ అందుకోవాల్సి ఉంది. హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్-4 లో సేఫ్‌గా ఉంది.

4. రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)

రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వంటి వారు రాణిస్తుండటంతో కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రదర్శన కొంచెం వెలవెలబోతోంది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 207 పరుగులే చేశాడు. గత మ్యాచ్‌లో 90 పరుగులు చేసినప్పటికీ, ఓవరాల్‌గా అతని బ్యాటింగ్ సగటు 23 మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

5. శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)

గుజరాత్ కెప్టెన్ గిల్ బ్యాటింగ్‌లో తన నిలకడను చాటుకుంటున్నాడు. ఇప్పటికే 350 పరుగులకు పైగా చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇతని జట్టు 9 మ్యాచుల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. గిల్ తన బ్యాటింగ్ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.

6. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్)

రుతురాజ్ ఈ సీజన్ నెమ్మదిగా మొదలుపెట్టినప్పటికీ, ముంబైపై 74 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. 9 మ్యాచుల్లో 245 పరుగులు చేసిన రుతురాజ్, సీఎస్‌కేను ప్లేఆఫ్స్ రేసులో నిలబెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. జట్టు ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది.

7. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్)

ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ తన ముద్ర వేయలేకపోతున్నాడు. 9 మ్యాచుల్లో కేవలం 31 పరుగులే చేసి, 8 వికెట్లు తీశాడు. అక్షర్ వైఫల్యం వల్ల ఢిల్లీ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.

8. అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్)

కేకేఆర్ కెప్టెన్ రహానే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బ్యాటర్ గా అతను పూర్తిగా విఫలమయ్యాడు. గత మూడు మ్యాచుల్లో అతని సగటు కేవలం 3.33 మాత్రమే. రహానే నాయకత్వంలో జట్టు వరుసగా 6 మ్యాచులు ఓడిపోయింది. దీంతో రహానేను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

9. హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాకు ఈ ఐపీఎల్ ఒక పీడకలగా మారింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులే చేసి, బౌలింగ్‌లో 4 వికెట్లు మాత్రమే తీశాడు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్, ఆటగాడిగా కూడా విఫలమవ్వడం ముంబైని దెబ్బతీసింది.

10. రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్)

27 కోట్ల భారీ ధర పలికిన రిషబ్ పంత్ లక్నో జట్టుకు పెద్ద మైనస్ అయ్యాడు. ఓపెనర్‌గా వచ్చినా, నెంబర్ 3 లో వచ్చినా పంత్ పరుగులు చేయలేకపోతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 189 పరుగులు చేసినప్పటికీ, జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేదు. లక్నో జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరన 10వ స్థానంలో ఉండటం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us