AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది సైలెంట్ కిల్లర్.. అలాంటి మరణాల్లో తెలంగాణ నెం.1.. కారణాలు ఏంటో తెలుసా..?

తెలంగాణలో కిడ్నీ వ్యాధులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఐసీఎంఆర్‌కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా అధ్యయనం ప్రకారం, దేశంలోనే కిడ్నీ వ్యాధుల వల్ల అత్యధిక మరణాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రతి లక్ష జనాభాకు దాదాపు 20 మంది కిడ్నీ వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇది సైలెంట్ కిల్లర్.. అలాంటి మరణాల్లో తెలంగాణ నెం.1.. కారణాలు ఏంటో తెలుసా..?
Kidney Disease Symptoms
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 11:23 AM

Share

తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే కిడ్నీ వ్యాధి మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఒకవైపు వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధిస్తున్నామని అనుకుంటున్న తరుణంలో.. ప్రతిష్టాత్మక ఐసిఎమ్ఆర్ కి చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురించిన తాజా అధ్యయనం ఈ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు దాదాపు 20 మంది కిడ్నీ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీ మరణాల రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ కిడ్నీ మరణాలు నమోదైన రాజస్థాన్ తో పోలిస్తే తెలంగాణలో ఈ రేటు ఏకంగా మూడు రెట్లు ఎక్కువ ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 11.64, కేరళ 9.1, తమిళనాడు 9.83 లతో పోల్చినా తెలంగాణలోనే మరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దేశంలోనే అత్యధికంగా కొత్త కిడ్నీ కేసులు నమోదవుతున్న రాష్ట్రం హర్యానా లక్షకు 316 మంది. తెలంగాణలో కొత్త కేసుల సంఖ్య లక్షకు 241 దేశ సగటుకు దగ్గరగానే ఉంది. కానీ, మరణాల రేటుకు వచ్చేసరికి మాత్రం తెలంగాణ అందరికంటే ముందుంది.అంటే.. ఇక్కడ వ్యాధిని ముందే గుర్తించలేకపోవడం, లేదా సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో కిడ్నీలు పాడైపోవడానికి, మరణాలు పెరగడానికి ప్రధాన కారణాల పై వైద్యులు విశ్లేషణ ఇలా..

1. డయాబెటిస్.. తెలంగాణలో కిడ్నీ మరణాలకు టైప్-2 డయాబెటిస్ అతిపెద్ద కారణం. రాష్ట్రంలో జరిగే కిడ్నీ మరణాలలో 25 శాతం మధుమేహం వల్లే జరుగుతున్నాయి. దేశంలోనే ఇది అత్యధిక శాతం.

2. హైపర్ టెన్షన్..అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీల ఫిల్ట్రేషన్ వ్యవస్థ దెబ్బతింటోంది.

3. యూత్ లో కొత్త ట్రెండ్స్.. 20 ఏళ్లకే బీపీ బారిన పడటం, జిమ్‌లకు వెళ్లే యువత మెడికల్ గైడెన్స్ లేకుండా **ప్రోటీన్ సప్లిమెంట్లు, క్రియాటిన్** విపరీతంగా వాడటం వల్ల కిడ్నీలు త్వరగా పాడవుతున్నాయని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

4. నొప్పి నివారణ మాత్రలు.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నొప్పికైనా ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లడం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వాడటం కిడ్నీలను నిర్వీర్యం చేస్తోంది.

5. ఆలస్యంగా గుర్తించడం.. కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించే యూరిన్ ప్రొటీన్ టెస్ట్, బ్లడ్ క్రియాటినిన్ పరీక్షలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నూటికి 50 నుండి 60 మంది రోగులు నేరుగా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లోనే ఆసుపత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 100కు పైగా కేంద్రాల్లో ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నప్పటికీ.. వ్యాధి రాకుండా ముందే అడ్డుకోవడం, ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు, బీపీ, షుగర్ ఉన్నవారు క్రమంతప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఈ సైలెంట్ కిల్లర్ మున్ముందు మరిన్ని ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉంది.

FAQ

ప్రశ్న: దేశంలోనే కిడ్నీ వ్యాధి మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

జవాబు: తెలంగాణ రాష్ట్రం.

ప్రశ్న: దేశంలోనే అత్యంత తక్కువ కిడ్నీ మరణాలు నమోదైన రాష్ట్రం ఏది?

జవాబు : రాజస్థాన్ రాష్ట్రం.

ప్రశ్న: దేశంలోనే అత్యధికంగా కొత్త కిడ్నీ కేసులు (లక్షకు 316) నమోదవుతున్న రాష్ట్రం ఏది?

జవాబు: హర్యానా రాష్ట్రం.

ప్రశ్న: కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించడానికి చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు ఏవి?

జవాబు: యూరిన్ ప్రొటీన్ టెస్ట్ – బ్లడ్ క్రియాటినిన్ పరీక్షలు, అలాగే బీపీ, షుగర్.

Follow Us