AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IND: భారత్‌ను బెంబేలెత్తించిన మెకాయ్‌.. రెండో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

IND vs WI 2nd T20: సెయింట్‌ కిట్స్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

WI vs IND: భారత్‌ను బెంబేలెత్తించిన మెకాయ్‌.. రెండో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి
India Vs West Indies
Basha Shek
|

Updated on: Aug 02, 2022 | 7:51 AM

Share

IND vs WI 2nd T20: సెయింట్‌ కిట్స్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత జట్టును వెస్టిండీస్‌ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఒబెడ్‌ మెక్‌కాయ్‌ బెంబేలెత్తించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చిన అతను 6వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. తద్వారా తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మెకాయ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది పురస్కారం లభించింది.

మొదటి బంతికే హిట్‌ మ్యాన్‌కు షాక్‌..

ఇవి కూడా చదవండి

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మెక్‌కాయ్‌ మొదటి ఓవర్‌లోనే షాకిచ్చాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (0)ను మొదటి బంతికే ఔట్‌ చేశాడు. ఇక వరుసగా రెండో మ్యాచ్‌లో ఓపెనర్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (11)తో పాటు శ్రేయస్ అయ్యర్ (10) కూడా మరోసారి నిరాశపర్చారు. రిషబ్ పంత్ (24 పరుగులు, 12 బంతుల్లో 2 సిక్స్‌లు) కొన్ని మెరుపులు మెరిపించానా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే హార్దిక్‌ పాండ్యా (31 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (30 బంతుల్లో 27; 1 సిక్స్‌) సంయమనంతో ఆడారు. అయితే మెక్‌కాయ్‌ ధాటికి దినేశ్‌ కార్తీక్‌ (7), అశ్విన్‌ (10), భువనేశ్వర్‌ (1) వరుసగా ఔటయ్యారు. దీంతో మరో రెండు బంతులు ఉండగానే టీమిండియా తన ఇన్నింగ్స్‌ను ముగించింది.

కొంప ముంచిన చివరి ఓవర్‌..

139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రెండన్ కింగ్ (52 బంతుల్లో 68, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించాడు. అయితే భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో బ్రెండన్‌ తప్ప మిగతా వారెవరూ పెద్దగా స్కోరు చేయలేదు. కెప్టెన్ నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి హార్డ్‌ హిట్లర్లు పూర్తిగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ మళ్లీ పోటీలోకి వచ్చింది. ఇక 16వ ఓవర్‌లో జోరుమీదున్న కింగ్‌ను అవేశ్‌ఖాన్‌ బౌల్డ్‌ చేయడంతో విజయంపై ఆశలు రేకెత్తాయి. చివరి 2 ఓవర్లలో విండీస్‌ విజయానికి 16 పరుగులు అవసరం కాగా, 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కేవలం 6 పరుగులు ఇచ్చి రోవ్‌మన్ పావెల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. కాగా కరేబియన్ల విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు కావాలి. స్వింగ్‌ కింగ్‌ భువనేశ్వర్ కుమార్‌కు ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆఖరి ఓవర్‌ అతనే వేస్తాడని అందరూ భావించారు. అయితే కెప్టెన్ రోహిత్ బంతిని అవేశ్ ఖాన్ చేతికి ఇచ్చి అందరినీ షాక్‌ కు గురిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని అవేశ్‌ ఒత్తడికి గురై మొదటి బంతినే నో బాల్‌ వేశాడు. దీనిని  నేరుగా స్టాండ్స్‌లోకి  పంపిన థామన్‌ తర్వాతి ఫ్రీ హిట్‌ను బౌండరీకి పంపించాడు. తద్వారా విండీస్‌ విజయాన్ని ఖరారు చేశాడు. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్‌ నేడు జరగనుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..