IND vs WI: 2 గంటలు ఆలస్యంగా రెండో టీ20 మ్యాచ్.. అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
India Vs West Indies 2nd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ నిర్ణీత సమయానికి రెండు గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆగస్ట్ 1, సోమవారం సెయింట్ కిట్స్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, మారిన సమయం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ఆలస్యానికి కారణం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. వర్షం లేదా వాతావరణం అనుకూలించకపోవడం లేదా మైదానం తడిగా మారడం అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. అసలు కారణం.. ఆటగాళ్ల లగేజీ సరైన సమయానికి చేరుకోకపోవడమేనంట.
ఆగస్ట్ 1 సోమవారం సాయంత్రం మ్యాచ్ ప్రారంభానికి దాదాపు రెండున్నర గంటల ముందు క్రికెట్ వెస్టిండీస్ ఒక అప్‌డేట్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభమవుతుందని విండీస్ బోర్డు తన ప్రకటనలో తెలిపింది. విండీస్ బోర్డు తన ప్రకటనలో పేర్కొన్న కారణం చూస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతకు ముందు చాలా అరుదుగా కనిపించింది.
వాస్తవానికి మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల లగేజీలు సమయానికి చేరుకోలేదంట. ఈ కారణంగానే మ్యాచ్ ఆలస్యంగా నిర్వహించనున్నట్లు విండీస్ బోర్డు ప్రకటనలో పేర్కొంది.
*CWI STATEMENT* Delayed start time for 2nd Goldmedal T20I Cup match, powered by Kent Water Purifiers | New Start Time: 12:30PM AST (11:30am Jamaica/10pm India)https://t.co/q1J5FBdZAh https://t.co/dy59uajSr8
— Windies Cricket (@windiescricket) August 1, 2022
అమెరికా వీసాతోనూ ఇబ్బందులు..
ఈ పరిస్థితిపై అభిమానులు, ప్రసారకర్తలు, స్పాన్సర్‌లకు విండీస్ బోర్డు క్షమాపణలు తెలిపింది. ఇది ఈ సిరీస్‌కు సంబంధించిన ఏకైక సమస్య కాదు. ఇది విండీస్ బోర్డుకు భారీ సమస్యగా మిగిలిపోయింది. ఇటీవలి నివేదికల ప్రకారం, సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల కోసం, రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు ఇంకా యూఎస్ వీసాలు పొందలేదు. దీని కారణంగా విండీస్ బోర్డు ఈ మ్యాచ్‌లను నిర్వహించడానికి అత్యవసర ప్రణాళికలను రూపొందించడం ప్రారంభించింది. ఈ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లు కరేబియన్ ద్వీపంలో జరగనుండగా, చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని లాడర్‌హిల్‌లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 6, 7 తేదీల్లో జరగనున్నాయి.