AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : అబ్బా.. ఏం ఫీల్ ఉంది మావ.. పాక్ వర్సెస్ బంగ్లా వన్డేలో వింత ఘటన

PAK vs BAN Viral Video : పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ ఆఘా రెండో వన్డేలో వింతగా రనౌట్ అయ్యారు. బౌలర్ కు బంతి ఇవ్వబోయి క్రీజు బయట ఉండటంతో మెహదీ హసన్ అతడిని అవుట్ చేశారు. ఈ ఘటనపై మైదానంలో తీవ్ర దుమారం రేగింది.

Viral Video : అబ్బా.. ఏం ఫీల్ ఉంది మావ.. పాక్ వర్సెస్ బంగ్లా వన్డేలో వింత ఘటన
Pak Vs Ban Viral Video
Rakesh
|

Updated on: Mar 13, 2026 | 6:09 PM

Share

Viral Video : ఢాకా వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘా అవుట్ అయిన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రనౌట్ అంటే బ్యాటర్ పరుగు కోసం ప్రయత్నించినప్పుడు జరుగుతుంది, కానీ ఇక్కడ సల్మాన్ ఆఘా తన అతి తెలివి వల్లనో లేదా అజాగ్రత్త వల్లనో వికెట్ పారేసుకున్నాడు. ఈ ఘటనతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అవుట్ ఇచ్చినందుకు సల్మాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బంగ్లా బౌలర్ మెహదీ హసన్ వేసిన బంతిని స్ట్రైకింగ్ లో ఉన్న రిజ్వాన్ తిన్నగా బౌలర్ వైపు ఆడాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ ఆఘా అప్పటికే క్రీజు వెలుపలికి వచ్చాడు. బంతి మెహదీ హసన్ వైపు వెళ్తుండగా, సల్మాన్ ఆఘా మధ్యలోనే ఆ బంతిని ఆపి, తన చేత్తో పట్టుకుని బౌలర్‌కు ఇవ్వబోయాడు. అయితే అప్పటికి సల్మాన్ ఇంకా క్రీజు బయటే ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన మెహదీ హసన్, అత్యంత వేగంగా సల్మాన్ చేతిలోని బంతిని లాక్కుని వికెట్లను గిరాటేశాడు. సల్మాన్ క్రీజు వెలుపల ఉండటంతో అంపైర్ నిబంధనల ప్రకారం అతడిని అవుట్‌గా ప్రకటించారు.

నిజానికి బంతి డెడ్ కాకముందు బ్యాటర్ క్రీజు వెలుపల ఉంటే ఫీల్డర్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. సల్మాన్ ఆఘా కేవలం బంతిని బౌలర్‌కు అందించాలనే ఉద్దేశంతోనే అలా చేసినా, నిబంధనలు మాత్రం బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నిర్ణయంతో షాక్ తిన్న సల్మాన్ ఆఘా, మైదానంలోనే తన కోపాన్ని ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్లేయర్లు క్రీడా స్ఫూర్తిని మరిచి ప్రవర్తించారని గొడవకు దిగాడు. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇది సరైన అవుట్ కావడంతో సల్మాన్ వెనుతిరగక తప్పలేదు. రనౌట్ అయిన తర్వాత సల్మాన్ మైదానంలో ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. కొందరు ఇది బంగ్లాదేశ్ ఆటగాళ్ల తెలివితేటలని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్థాన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాగే చర్చలే నడిచాయి. అయితే పాకిస్థాన్ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో, ఇలాంటి అనవసరపు అవుట్లు జట్టుపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. సల్మాన్ ఆఘా చేసిన ఈ చిన్న పొరపాటు అతడికి భారీ జరిమానా లేదా నిషేధాన్ని కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us