AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC vs BCB : తన గోతిని తానే తవ్వుకున్న బంగ్లాదేశ్.. 2031 వరల్డ్ కప్ హోస్టింగ్ కూడా కట్?

ICC vs BCB : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న మొండి నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించారన్న కోపంతో భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు తమ జట్టును పంపబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడమే కాకుండా.. భవిష్యత్తులో భారీ ఆదాయాన్ని, టోర్నీల ఆతిథ్య హక్కులను కూడా బంగ్లాదేశ్ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

ICC vs BCB : తన గోతిని తానే తవ్వుకున్న బంగ్లాదేశ్.. 2031 వరల్డ్ కప్ హోస్టింగ్ కూడా కట్?
Bangladesh Cricket (2)
Rakesh
|

Updated on: Jan 23, 2026 | 4:28 PM

Share

ICC vs BCB : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ప్రభుత్వం కలిసి ఐసీసీతో తలపడటం ప్రస్తుతం క్రికెట్లో పెను సంచలనంగా మారింది. అసలు వివాదం ఐపీఎల్ నుంచి మొదలైంది. స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ పంపించేయడంతో, బంగ్లాదేశ్ బోర్డు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతికారంగా భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు రాబోమని, తమ మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ ఈ డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆడాలనుకుంటే భారత్‌కు రావాల్సిందేనని, లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసింది. ఈ మొండి పట్టు వల్ల బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను వరల్డ్ కప్‌లోకి తీసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

ఈ వివాదం వల్ల బంగ్లాదేశ్‌కు జరిగే నష్టం ఊహాతీతం. ప్రధానంగా 2031లో భారత్‌తో కలిసి బంగ్లాదేశ్ వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ, ఆ ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్ నుంచి వెనక్కి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఆతిథ్యం చేజారితే, బంగ్లాదేశ్ ఆర్థికంగా కుప్పకూలడం ఖాయం. ఒక మెగా టోర్నీ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల స్పాన్సర్‌షిప్, టికెట్ ఆదాయాన్ని ఆ దేశం కోల్పోతుంది.

ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇరుక్కుపోయింది. ఐసీసీ నుంచి బంగ్లాదేశ్‌కు ఏటా సుమారు 325 కోట్ల బంగ్లాదేశీ టకా (దాదాపు రూ.250 కోట్లు) ఆదాయం అందుతుంది. నిబంధనల ఉల్లంఘన కింద ఈ నిధులను ఐసీసీ నిలిపివేసే ఛాన్స్ ఉంది. అదనంగా వరల్డ్ కప్‌లో ఆడితే వచ్చే ప్రైజ్ మనీని కూడా వారు వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో క్రికెట్ ప్రజాదరణ ఉన్నప్పటికీ, బోర్డు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల క్రీడాకారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ఆంక్షలు కేవలం పురుషుల జట్టుకే పరిమితం కాకపోవచ్చు. బంగ్లాదేశ్ మహిళా జట్టు, అండర్-19 జట్లను కూడా రాబోయే ఐసీసీ టోర్నీల నుంచి నిషేధించే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాపులో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బీసీసీఐ వంటి పవర్ఫుల్ బోర్డుతో పెట్టుకోవడం వల్ల ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు వెనకాడవచ్చు. మొత్తానికి ముస్తాఫిజుర్ విషయంలో మొదలైన చిన్న చిచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ సామ్రాజ్యాన్నే దహించేలా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..