Shubman Gill : శుభ్‌మన్ గిల్‌ను పట్టుకున్న పార్థ్ ‘భూతం’..రంజీలో రెండు సార్లు అట్టర్ ప్లాప్
Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్, ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకునే శుభ్‌మన్ గిల్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దారుణంగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా పుంజుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్, ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకునే శుభ్‌మన్ గిల్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దారుణంగా విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే బౌలర్ చేతిలో అతను బలైపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌరాష్ట్ర స్పిన్నర్ పార్థ్ భూత్ మాయాజాలానికి గిల్ ఏమాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. రెండు సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో గిల్ టెక్నిక్‌పై మళ్ళీ ప్రశ్నలు మొదలయ్యాయి.
రాజ్‌కోట్ వేదికగా పంజాబ్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర పోరు కనిపించింది. టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్‌గా భావించే శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో తన ముద్ర వేయలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనైనా పుంజుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. కేవలం 14 పరుగులు చేసి మరోసారి పెవిలియన్ చేరాడు. విశేషం ఏమిటంటే.. రెండు సార్లు పార్థ్ భూత్ వేసిన బంతులకు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోవడం గిల్ బలహీనతను ఎత్తిచూపుతోంది. కేవలం ఫ్లాట్ పిచ్‌లపై మాత్రమే గిల్ పరుగులు చేయగలడని, బంతి తిరిగే పిచ్‌లపై అతను తడబడతాడని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు పంజాబ్ బ్యాటర్లను పార్థ్ భూత్ తన స్పిన్ మాయాజాలంతో హడలెత్తించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన పార్థ్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 8 పరుగులు ఇచ్చి మరో 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి సౌరాష్ట్రను గెలుపు ముంగిట నిలబెట్టాడు. పార్థ్ అద్భుత బౌలింగ్ ధాటికి పంజాబ్ జట్టు రెండో రోజే ఓటమి అంచున చేరింది.
ఎవరీ పార్థ్ భూత్?
గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన పార్థ్ భూత్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. తని తండ్రి ఒక ప్రాపర్టీ డీలర్. వారి కుటుంబంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన మొదటి వ్యక్తి పార్థే. జునాగఢ్‌లో సరైన క్రికెట్ అకాడమీలు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మొండి పట్టుదలతో 2019లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 66 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఏడుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రికార్డు ఇతనికి ఉంది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్‌లో వచ్చి బ్యాటింగ్‌లోనూ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ బాది ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు.
ఈ ప్రదర్శనతో పార్థ్ భూత్ పేరు ఇప్పుడు మార్మోగిపోయింది. శుభ్‌మన్ గిల్ వంటి క్వాలిటీ బ్యాటర్‌ను ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు అవుట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, పార్థ్ త్వరలోనే ఐపీఎల్, టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడటం ఖాయం. మరోవైపు సౌతాఫ్రికా పర్యటన, రాబోయే సిరీస్‌లకు ముందు గిల్ ఇలా ఫామ్ కోల్పోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాస్త ఆందోళనలో పడేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
