Team India : గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా? సూర్య సేనకు ఫ్యాన్స్ చురకలు
Team India : టీ20 వరల్డ్ కప్ 2026కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించినప్పటికీ, జట్టులో ఒక ప్రధాన లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

Team India : టీ20 వరల్డ్ కప్ 2026కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించినప్పటికీ, జట్టులో ఒక ప్రధాన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఫీల్డింగ్. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారిస్తున్నా, బౌలింగ్‌లో వికెట్లు తీస్తున్నా.. ఫీల్డింగ్‌లో చేస్తున్న తప్పిదాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వరల్డ్ కప్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం న్యూజిలాండ్‌ను 190 పరుగులకే కట్టడి చేసి 48 పరుగుల తేడాతో విజయం అందుకుంది. విజయం చూడటానికి ఘనంగానే ఉన్నా, ఫీల్డర్లు చేసిన తప్పిదాలు మ్యాచ్ గమనాన్ని మార్చేలా కనిపించాయి. ముఖ్యంగా కివీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన అవకాశాలను భారత ఫీల్డర్లు చేజార్చారు. సంజూ శామ్సన్ ఒక సులువైన రన్-అవుట్ ఛాన్స్‌ను వదిలేశాడు. అప్పటికి ఫిలిప్స్ 41 పరుగుల వద్ద ఉన్నాడు, కానీ ఆ లైఫ్ లైన్‌ను అతను 78 పరుగుల వరకు వెళ్లి భారత్‌ను భయపెట్టాడు.
కేవలం రన్ అవుట్లు మాత్రమే కాదు, క్యాచ్‌ల విషయంలోనూ భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. రింకూ సింగ్ వంటి నమ్మకమైన ఫీల్డర్ కూడా మార్క్ చాప్‌మ్యాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. ఇక ఇన్నింగ్స్ ఆఖర్లో డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌లను అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఒకరి తర్వాత ఒకరు నేలపాలు చేశారు. ఒక్క మ్యాచ్‌లోనే మూడు క్యాచ్‌లు, రెండు రన్ అవుట్ మిస్సులు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న జట్లతో ఆడేటప్పుడు ఇవి పెద్దగా అనిపించకపోవచ్చు కానీ, వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీల్లో ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది.
గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్ ఇలాంటి ఫీల్డింగ్ తప్పిదాల వల్లే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు టీ20ల్లోనూ అదే పునరావృతం కావడం ఆందోళనకరం. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పర్యవేక్షణలో జట్టు మెరుగుపడుతుందని ఆశించినా, మైదానంలో ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. వరల్డ్ కప్ భారత్‌లోనే జరగనుంది కాబట్టి, మన ఫీల్డర్లు సొంత గడ్డపై మరింత చురుగ్గా ఉండాలి. రాయ్‌పూర్ లో జరగబోయే రెండో మ్యాచ్ కైనా ఈ తప్పులను సరిదిద్దుకోకపోతే, సూర్యకుమార్ యాదవ్ సేనకు కష్టాలు తప్పవు.
బౌలర్లు కష్టపడి వికెట్ అవకాశాలు సృష్టిస్తున్నప్పుడు, ఫీల్డర్లు సహకరించకపోతే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వరల్డ్ కప్ గెలవాలంటే క్యాచ్ విన్ మ్యాచ్ అనే సూత్రాన్ని టీమిండియా తూచా తప్పకుండా పాటించాలి. మరి రాయ్‌పూర్ పోరులోనైనా మన ఫీల్డర్లు మెరుగ్గా రాణిస్తారో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
