అభిషేక్ కాదు.. న్యూజిలాండ్‌ను షేక్ చేసిన మాయగాడు అతడే.. : లిటిల్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Gavaskar Magician Comment: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20లో ఒక భారత ఆటగాడి ప్రదర్శన దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను మంత్రముగ్ధులను చేసింది. అందరూ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి చర్చిస్తుంటే, గవాస్కర్ మాత్రం మరో స్టార్ ప్లేయర్‌ను 'మాంత్రికుడు' అంటూ అభివర్ణించారు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Gavaskar Magician Comment: బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 తర్వాత భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ప్రశంసలతో ముంచెత్తారు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన ట్రాక్‌లో తన 4 ఓవర్లలో 37 పరుగులకు 2 వికెట్లు తీసిన ఈ కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్ ను మిస్టరీ మ్యాన్ గా పేర్కొన్నారు. తన స్పెల్ సమయంలో టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్‌మన్‌లను ఔట్ చేశాడు. బౌండరీలు కొట్టినప్పటికీ బౌలింగ్‌లో చక్రవర్తి చూపించిన ఆత్మవిశ్వాసం బాగుందని గవాస్కర్ తెలిపారు. ఈ క్రమంలో ఈ స్పిన్నర్‌ను “మాంత్రికుడు” అంటూ ఆయన అభివర్ణించారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. “వరుణ్ మొదట్లో కొంచెం పట్టు తప్పినట్లు కనిపించాడు. కానీ పరిస్థితిని అర్థం చేసుకుని, రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే, బ్యాటర్లను పరుగులు తీయకుండా కట్టడి చేశాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. బౌండరీలు బాదినప్పుడు, ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడు” అని గవాస్కర్ జియోహాట్‌స్టార్‌తో అన్నారు.
ఆత్మవిశ్వాసం అదుర్స్..
“వరుణ్ తిరిగి తన స్థానానికి చేరుకుంటున్నాడు. తన బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టడం చూసి అతను ఆశ్చర్యపోలేదు. అది ఎల్లప్పుడూ చాలా మంచి సంకేతం. అతను ఒక మాంత్రికుడు, తప్పు చేయలేదు. అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఈ ఫార్మాట్‌లో లేదా 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా ఇలాంటి ఆత్మవిశ్వాసంతో కనిపించాలి, మనల్ని మనం నమ్మాలి’ అని లిటిల్ మాస్టర్ అన్నారు.
తొలి టీ20లో దూకుడు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో భారత్ న్యూజిలాండ్‌ను 48 పరుగుల తేడాతో ఓడించింది. అభిషేక్ శర్మ సంచలనాత్మక ఇన్నింగ్స్‌తో భారత్ కదం తొక్కింది.
అభిషేక్ 35 బంతుల్లో 84 పరుగులు చేయడంతో ఏడు వికెట్లకు 238 పరుగులు చేసింది. ఈ క్రమంలో అభిషేక్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో రాణించాడు. అభిషేక్ కాకుండా రింకు సింగ్ 20 బంతుల్లో 44 నాటౌట్‌గా నిలిచి ఆతిథ్య జట్టును 230 పరుగుల మార్కును దాటించాడు. సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) కూడా కీలక సహకారాన్ని అందించారు. ఇక న్యూజిలాండ్ తరపున, జాకబ్ డఫీ 27 పరుగులకు 2 వికెట్లు పడగొట్టి బౌలర్లలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో, న్యూజిలాండ్ 7 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. చక్రవర్తి, శివం దుబే తలా రెండు వికెట్లు పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



