IPL 2026: ముస్తాఫిజుర్ స్థానంలో రానున్న డేంజరస్ బౌలర్లు.. ఆ ముగ్గురిపై కన్నేసిన కేకేఆర్..!
Who Could Replace Mustafizur Rahman: బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ముగ్గురు బౌలర్లపై కన్నేసింది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

Who Could Replace Mustafizur Rahman: ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ఎంపికైనప్పటికీ, భారత్‌లో వ్యతిరేకత పెరుగుతుండటంతో అతడిని తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ యాజమాన్యాన్ని ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
దీంతో ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేసి, బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే కొత్త బౌలర్ కోసం కేకేఆర్ అన్వేషణ మొదలుపెట్టింది.
9.20 కోట్లకు ముస్తాఫిజుర్‌ను కొన్న కేకేఆర్..
షారుఖ్ ఖాన్ జట్టు ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉండటంతో ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపాయి. 2025 సీజన్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల అతను ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు.
ముస్తాఫిజుర్ స్థానంలో వచ్చే అవకాశం ఉన్న ముగ్గురు బౌలర్లు:
1. జే రిచర్డ్‌సన్ (Jhye Richardson): ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్. గాయాల కారణంగా ఇతని కెరీర్ ఒడిదొడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ ఏడాది వేలంలో ఇతడు అన్‌సోల్డ్ (ఎవరూ కొనలేదు) గా మిగిలిపోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అనుభవం ఇతనికి ఉంది. కేకేఆర్ ఇతని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
2. అల్జారీ జోసెఫ్ (Alzarri Joseph): వెస్టిండీస్‌కు చెందిన ఈ పొడగరి పేసర్ ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్ల తరపున ఆడాడు. ఒకే ఐపీఎల్ మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన జోసెఫ్, తన వేగంతో ముస్తాఫిజుర్ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలడు. ఇప్పటివరకు 22 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు.
3. రిలే మెరెడిత్ (Riley Meredith): ఆస్ట్రేలియాకు చెందిన మరో వేగవంతమైన బౌలర్ రిలే మెరెడిత్. 29 ఏళ్ల మెరెడిత్‌కు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అనుభవం ఉంది. 18 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 144 టీ20 మ్యాచ్‌ల్లో 193 వికెట్లు పడగొట్టిన ఇతని అనుభవం కేకేఆర్‌కు బాగా కలిసి వస్తుంది. 2026 మినీ వేలంలో ఇతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు, కాబట్టి రీప్లేస్‌మెంట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది.




