5 మ్యాచ్‌ల్లో ఫెయిలైతే తీసేస్తారా.. 100 ఛాన్సులిచ్చినా 10 మ్యాచ్‌ల్లో ఆడనివాళ్లు లేరా?: బీసీసీఐపై యోగరాజ్ సింగ్ ఫైర్..!
Team India T20 World Cup 2026 squad: టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 స్వ్కాడ్‌పై మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లో ఆడకుంటేనే తప్పిస్తారా అంటూ ఏకిపారేశారు. కపిల్ దేవ్‌ను కూడా ఈ విషయంలోకి లాగడం గమనార్హం.

Team India T20 World Cup 2026 squad: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సెలక్టర్లపై నిప్పులు చెరిగారు. గిల్‌ను జట్టులో తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సెలక్టర్లపై యోగ్‌రాజ్ సింగ్ ఆగ్రహం..
టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో శుభ్‌మన్ గిల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గిల్‌కు బదులుగా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ యోగ్‌రాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “శుభ్‌మన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్. కేవలం నాలుగు-ఐదు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రాన అతడిని ఎలా తొలగిస్తారు? భారత క్రికెట్‌లో 100 అవకాశాల్లో కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లకు అండగా ఉన్న సెలక్టర్లు, గిల్‌ను ఎందుకు పక్కనపెట్టారు?” అని ఆయన ప్రశ్నించారు.
IND vs NZ: అగార్కర్ బృందానికి నా నివాళులు.. మరోసారి హ్యాండివ్వడంపై షమీ కోచ్ సంచలన కామెంట్స్..
కపిల్ దేవ్ ఉదాహరణతో విమర్శలు..
ఈ క్రమంలో యోగ్‌రాజ్ సింగ్ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌ను కూడా ఈ వివాదంలోకి లాగారు. గతంలో కపిల్ దేవ్ ఫామ్ కోల్పోయినప్పుడు అప్పటి కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అతనికి ఎలా మద్దతుగా నిలిచారో గుర్తు చేశారు. “పాకిస్థాన్ పర్యటనలో కపిల్ దేవ్ బ్యాట్, బంతితో ఘోరంగా విఫలమైనా, బిషన్ సింగ్ బేడీ అతడిని తర్వాతి ఇంగ్లాండ్ పర్యటనకు తీసుకెళ్లారు. ఎందుకంటే పెద్ద ఆటగాళ్లకు ఫామ్ లేనప్పుడు మద్దతు ఇవ్వడం ముఖ్యం. కానీ ప్రస్తుత సెలక్టర్లు గిల్ విషయంలో ఆ సహనం చూపడం లేదు” అని యోగ్‌రాజ్ విమర్శించారు.
గిల్ గతేడాది గణాంకాలు..
శుభ్‌మన్ గిల్ గతేడాది టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతని గణాంకాలు ఇలా ఉన్నాయి:
మొత్తం మ్యాచ్‌లు: 15
పరుగులు: 291
సగటు: 24.25
స్ట్రైక్ రేట్: 137.26
హాఫ్ సెంచరీలు: 0
అజిత్ అగార్కర్ వివరణ..
మరోవైపు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గిల్ తొలగింపుపై స్పష్టతనిచ్చారు. గిల్ ప్రతిభావంతుడైన ఆటగాడనడంలో సందేహం లేదని, అయితే ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్-బ్యాటర్ అవసరమని భావించి ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సెలక్టర్లు ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి.




